mt_logo

‘నిజామూ’.. నిజాలూ..

By: కట్టా శేఖర్‌రెడ్డి

కాసును, చంద్రబాబును, రాజశేఖర్‌రెడ్డిని తెలంగాణ ఎందుకు ప్రేమించడం లేదు? తెలంగాణకు ఎక్కువగా అన్యాయాలు జరిగింది వారి పాలనలోనే. తెలంగాణ ఎక్కువగా వివక్షలపాలైంది వారి ఏలుబడిలోనే. తెలంగాణ రాష్ట్ర కాంక్షకు అడ్డంగా నిలబడి, ప్రత్యక్షంగా ఉద్యమకారులతో తలపడింది వారే. వీరంతా హైదరాబాద్‌లో ప్రైవేటు సామ్రాజ్యాలు నిర్మించడానికి, సొంత సామ్రాజ్యాలు నిర్మించుకోవడానికి పాటుపడ్డారు. నిజాం వేల కోట్ల రూపాయల విలువచేసే ఆస్తులు, భూములు, చెరువులు తెలంగాణకు అందించిపోయారు. అందుకే వారికంటే నిజాం ఉన్నతంగా కనిపిస్తారు. ఇది చేదు నిజం. అందరికీ అంత తొందరగా జీర్ణం కాదు.

నిజాం గురించి మాట్లాడిన ప్రతిసారి వివాదం తలెత్తుతున్నది. టీడీపీ నాయకులు మొదలు కమ్యూనిస్టుల వరకు అందరూ అదిగో ఒక నియంతను పొగుడుతున్నాడు చూడండి అని విమర్శిస్తున్నారు ముఖ్యమంత్రిని. నిజాం పాలన గురించి ఇప్పుడయినా నిజాలు మాట్లాడుకోవాలి. నిజాం పాలనలో తప్పులు జరిగినమాట నిజమే. అది భూస్వామిక పాలన నిజమే. ప్రజలపై స్వారీ చేసింది కూడా నిజమే.

ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కూడా నిజాం రాజు కొన్ని పొరపాట్లు చేసిన మాట వాస్తవమేనని అంగీకరిస్తున్నారు. అదే సమయంలో తెలంగాణకు ఆయన సృష్టించిన సంపదను, సమకూర్చిన సదుపాయాలను ఎలా విస్మరిస్తామని, ఆ మాట చెప్పకుండా ఎలా ఉంటామని చెబుతున్నారు. ఏ రాజులు ఏ రాజధానిలో నిర్మించని అద్భుత సౌధాలను నిజాం రాజు హైదరాబాద్‌లో నిర్మించారు. నిజాంసాగర్, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ వంటి అనేక ప్రాజెక్టులను పూర్తి చేశారు. ఇంకా అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. ఎవరి సొమ్ముతో ఇవన్నీ చేశారని ఎవరయినా ప్రశ్నించవచ్చు.

ఇక్కడ ప్రజల గోళ్లూడగొట్టి వసూలు చేసిన సొమ్మును బ్రిటన్‌కో, ఫ్రెంచికో, డచ్చికో ఓడల్లో తరలించుకుపోయినవాళ్లనే చూశాం. కానీ ఇది తన రాజ్యమని, ఇక్కడే శాశ్వతంగా రాజ్యం చేస్తానని ఆశించి, అదే సొమ్ముతో నిర్మాణాలు చేశారు నిజాం. అస్థిత్వ ఉద్యమంలో ఎదిగివచ్చిన నాయకులు ఎవరయినా తమ చరిత్రను పునస్సమీక్షించుకుంటారు. చరిత్రలో జరిగిన మంచి చెడులను తడిమి చూస్తారు. రజాకార్ల అరాచకాలను అనుభవించిన పల్లెలు, కుటుంబాల నుంచి వచ్చిన నావంటి వారికి నిజాం రాజుపై ఇసుమంతయినా సదభిప్రాయం ఉండే అవకాశం లేదు.

నాకు ఆయన ఇప్పటికీ తెలంగాణను తన ఉక్కుపాదాల కింద తొక్కిపెట్టిన నిరంకుశ ప్రభువు. అయితే చరిత్రను కేవలం వ్యక్తిగత అనుభవాలు, భావోద్వేగాలు, రాజకీయాల దృష్టితో చూస్తే మనకు ఒక పార్శమే కనిపిస్తుంది. మరో పార్శాన్ని అసలు చూడడానికే ప్రయత్నించం. ఇది ఆత్మాశ్రయ(సబ్జెక్టివ్)వాద దృష్టి. వాస్తవిక(ఆబ్జెక్టివ్) దృష్టి మరుగున పడిపోతుంది. నిజాంను పొగిడినంత మాత్రాన మిగతా పార్శాలను విస్మరించినట్టు ఎలా వక్రీకరిస్తారు? తెలంగాణలో అస్థిత్వ ప్రతీకలన్నింటినీ తలకెత్తుకుని మోసింది కేసీఆరే. కొమురం భీమ్‌ను తెలంగాణ పోరాటానికి ప్రతీకగా చెప్పుకున్నది కేసీఆరే. బందగి, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మలను అస్థిత్వ చిహ్నాలుగా ముందుపెట్టుకుని నడిచింది తెలంగాణ ఉద్యమమే. అదే సమయంలో నిజాం చేసిన మంచి పనులను కూడా కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలోనే చెప్పారు. ఆయనను అప్పుడు కూడా తెలంగాణ ప్రజలు తప్పుగా అర్థం చేసుకోలేదు. స్వరాష్ట్రంలో తెలంగాణ చరిత్రను సరికొత్త దృక్పథంతో చూడాలన్నది ఆయన భావన. చరిత్ర పురుషుల గురించి ఒకే పార్శం చూడాలని, వ్యతిరేక పార్శమే చూడాలని చెప్పేవారు ఒక్కసారి సమకాలీన చరిత్రలోకి వెళ్లి చూడండి…

తెలంగాణకు వ్యతిరేకంగా అనేక కుట్రలు చేసి, వందలాది మంది తెలంగాణ యువకుల పచ్చినెత్తురు తాగిన ఒక మహానుభావుడి విగ్రహం హైదరాబాద్ గుండెలపై ఇప్పటికీ భద్రంగా గంభీరంగా నిల్చున్నది. ఆయన పేరిట పార్కులుంటాయి. సంస్థలుంటాయి. హైదరాబాద్‌లో కూడా వర్ధంతులు, జయంతులు నిర్వహిస్తుంటారు. ఎందుకని? నాగార్జునసాగర్‌ను తెలంగాణకు సరిగ్గా అక్కరకు రాకుండా చేసిన మహానుభావులు కొంతమందికి అపర భగీరథులు. వారి పేరిట పురస్కారాలు, భవనాలు వెలుస్తాయి. ఎందుకని? రైతులను కాల్చి చంపించిన వారు, ఎన్‌టిఆర్‌ను పదవి నుంచి దింపి, చంపిన వారు, హైదరాబాద్‌ను ఒక వలస కాలనీగా మార్చిన వారు, తెలంగాణకు వ్యతిరేకంగా అన్నిరకాల కుట్రలు చేసినవారు ఎవరు? వారు తెలంగాణకు ఏమవుతారు? ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎవరి పక్కన నిలబడి నిజాంను విమర్శిస్తున్నారు? తెలంగాణ ఉద్యమాన్ని ఆగం పట్టించాలని సకల ప్రయత్నాలు చేసిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తెలంగాణకు ఏం వరుస అవుతారు? వ్యతిరేక దృష్టితో చూస్తే ప్రతి నాయకుడిలో ఒక నిజాం కనిపించడం లేదా? కమ్యూనిస్టులు ముందుగా నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. ఆ తర్వాత నెహ్రూ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడారు.

పార్లమెంటు పందులదొడ్డి అని ఎన్నికలకూ దూరంగా ఉన్నారు. కొందరయితే దేశానికి స్వాతంత్య్రమే రాలేదన్నారు. కానీ సాయుధ పోరాటం కొనసాగించడం తప్పని ఆ తర్వాత నిర్ణయించుకున్నారు. స్వాతంత్య్రం కూడా వచ్చిందన్నారు. పార్లమెంటుకూ దూరంగా ఉండడం మంచిది కాదనీ తీర్మానించుకున్నారు. నెహ్రూపై తమ వైఖరి మార్చుకున్నారు. సుభాష్‌చంద్రబోస్‌ను ఒకప్పుడు నాజీ ఏజెంటు అని నిందించినవారు తమ అభిప్రాయాలు సత్యదూరమనుకున్నారు. దేశభక్తుడంటున్నారు. అంటే చరిత్రలో అభిప్రాయాలు నిశ్చలంగా ఏమీ లేవు. తెలంగాణలో మూడు వేల గ్రామాలను విముక్తి చేసి, పేదలకు భూములను పంచిన నాలుగు వేల మంది మెరికల్లాంటి కమ్యూనిస్టు యోధులను ఊచకోత కోయించిన సర్దార్ వల్లభ్‌భాయి పటేల్, జనరల్ చౌదరి బీజేపీ వారికి ప్రీతిపాత్రులు. కమ్యూనిస్టులకు పరమ వ్యతిరేకులు.

గుజరాత్‌లో మారణహోమం జరిగిన సందర్భంలో మోడీని దేశం ఎలా చూసింది? ఇప్పుడు ఎలా చూస్తున్నది? ఎంతోదూరం ఎందుకు? జాతిపిత మహాత్మాగాంధీని చంపిన నాథూరామ్ గాడ్సేను దేశభక్తునిగా మలిచే మహానుభావులూ తయారయ్యారు. మనలను ప్రభావితం చేసిన పరిణామాల నుంచి ఆయా కాలాల ప్రముఖులపై అభిప్రాయాలు ఏర్పరచుకుంటాం. అదే వాస్తవం కాదు, అదొక్కటే వాస్తవం కాదు.

వ్యతిరేక దృష్టితో చూస్తే గతమంతా చీకటిగానే కనిపిస్తుంది. నిజాంను చూసిన కళ్లతోనే సమైక్యపాలనను చూస్తే ఎలా ఉంటుంది? సమైక్యపాలన అంతా దోపిడీపాలనగానే చూడడం న్యాయమవుతుందా? విద్య, వైద్యం, రోడ్డు రవాణా, నీటిపారుదల, ఐటి రంగాల్లో వచ్చిన అభివృద్ధిని పూర్తిగా విస్మరించగలమా? స్కూళ్లు, ప్రాజెక్టులు వస్తే జనం తెలివిన పడతారు. మన మాట వినరు. మన పెత్తనం నడవదు అని తమ ఊర్లకు వాటిని రాకుండా చూసిన భూస్వామ్యవర్గాల నాయకులు తెలంగాణలో కొల్లలు.

ఆలస్యమయితే అయ్యింది కానీ మా ఊరికి ఉన్నతపాఠశాల వచ్చింది 1975లో. అంతకు ముందు ఎనిమిది కిలోమీటర్ల దూరం వెళ్లి చదువుకోవలసివచ్చేది. 1948 వరకు మా వాళ్లంతా విధిగా ఉర్దూలోనే చదువుకోవలసి వచ్చేది. తెలుగులో చదువుకునే అవకాశాలు లేవు. నిజాం తెలంగాణ ప్రజలను తెలుగు భాషకు దూరం చేశారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల సంపర్కం వల్ల కొన్ని రంగాలలో అభివృద్ధి వేగవంతమైన మాట వాస్తవం. ప్రపంచ వాణిజ్యపటంలో హైదరాబాద్ పేరు వినిపిస్తున్నదీ అంటే ఇక్కడ గత యాభైయ్యేళ్లలో జరిగిన అభివృద్ధి కూడా కారణం. ఔషధ, ఐటి పరిశ్రమల విషయంలో దేశంలో ఏ నగరానికీ తీసిపోని పేరు ప్రఖ్యాతులు హైదరాబాద్‌కు దక్కాయి. నాగార్జునసాగర్, జూరాల, శ్రీరాంసాగర్, ఎస్సెల్‌బీసీ వంటి కొన్ని ప్రాజెక్టులయినా పూర్తయింది సమైక్యపాలనలోనే.

కాసు బ్రహ్మనందారెడ్డి, ఎన్‌టిఆర్, చంద్రబాబునాయుడు, రాజశేఖర్‌రెడ్డి వంటివారు అసలే మంచి చేయకపోతే ఇవన్నీ జరిగేవి కాదు. ఎన్‌టి రామారావు తెలంగాణ రాజకీయ చిత్రపటాన్ని మార్చారు. బూజుపట్టిన రాజకీయాలను బదాబదలు చేసి పూర్తిగా ఒక కొత్త తరం నాయకత్వాన్ని తెలంగాణకు పరిచయం చేశారు. కానీ కాసును, చంద్రబాబును, రాజశేఖర్‌రెడ్డిని తెలంగాణ ఎందుకు ప్రేమించడం లేదు. తెలంగాణకు ఎక్కువగా అన్యాయాలు జరిగింది వారి పాలనలోనే. తెలంగాణ ఎక్కువగా వివక్షలపాలైంది వారి ఏలుబడిలోనే. తెలంగాణ రాష్ట్ర కాంక్షకు అడ్డంగా నిలబడి, ప్రత్యక్షంగా ఉద్యమకారులతో తలపడిందివారే. వీరంతా హైదరాబాద్‌లో ప్రైవేటు సామ్రాజ్యాలు నిర్మించడానికి, సొంత సామ్రాజ్యాలు నిర్మించుకోవడానికి పాటుపడ్డారు. నిజాం వేల కోట్ల రూపాయల విలువచేసే ఆస్తులు, భూములు, చెరువులు తెలంగాణకు అందించిపోయారు. అందుకే వారికంటే నిజాం ఉన్నతంగా కనిపిస్తారు. ఇది చేదు నిజం. అందరికీ అంత తొందరగా జీర్ణం కాదు.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *