మా ఎంసెట్ పరీక్షను మేమే నిర్వహించుకుంటాం తప్ప ఉమ్మడిగా పరీక్ష నిర్వహించే ప్రసక్తే లేదని, అవసరమైతే ఏపీ ఎంసెట్ నిర్వహణలో సహకారం అందిస్తామని విద్యాశాఖ మంత్రి జీ జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ఎంసెట్ పై గత కొద్దిరోజులుగా రెండు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించేందుకు గవర్నర్ నరసింహన్ ఇరు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో రెండుసార్లు చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో మరోసారి మంత్రులతో విడిగా సమావేశం కావాలని నిర్ణయించారు.
సోమవారం మంత్రి జగదీష్ రెడ్డి గవర్నర్ నరసింహన్ ను కలిసి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 75 ప్రకారం తామే ఎంసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని, అవసరమైతే ఏపీ ఎంసెట్ నిర్వహణకు కూడా సహకరిస్తామని చెప్పారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం తమతో పరస్పర అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకోవాల్సి ఉంటుందని మంత్రి చెప్పారు. గవర్నర్ తో సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశమై ఎంసెట్ పరీక్షకు చెందిన అంశాలను జగదీష్ రెడ్డి వివరించారు.