-వివిధ పథకాలకు ఒకేరోజు రూ. 173.38 కోట్లు విడుదల
-ఐడీహెచ్ కాలనీలో కొత్త ఇండ్ల నిర్మాణానికి రూ. 36 కోట్లు
దసరా నుంచి పనులు ప్రారంభిస్తానని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అందుకుతగ్గట్టుగానే సన్నాహాలు మొదలుపెట్టింది. డ్వాక్రా, సెర్ప్, అభయహస్తం పథకాలతోపాటు ఐడీహెచ్ కాలనీకి, పీజీసెంటర్లకు, ఆర్ అండ్ బీ విభాగానికి నిధులను కేటాయించింది. మంగళవారం ఒక్కరోజే 173 కోట్ల 38 లక్షల 56 వేల నిధులను విడుదలచేసి సంచలనం సృష్టించింది. ఈ మేరకు వివిధ శాఖలు మంగళవారం ఉత్తర్వులు జారీచేశాయి. గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా సెప్టెంబర్ మాసానికి రూ. 67.71 కోట్లు విడుదల చేయగా, ఐడీహెచ్ కాలనీని పునర్నిర్మిస్తామని ఆ కాలనీవాసులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ అమలు కోసం రూ. 36.54 కోట్ల నిధులను విడుదల చేశారు. ఈ కాలనీకి గాంధీ జయంతి రోజున కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.
డ్వాక్రా రుణాలకు రూ.5.13 కోట్లు
డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాల పథకం కింద రూ.ఐదు కోట్ల 13 లక్షల 33 వేలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈమేరకు మంగళవారం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి జీ రేమండ్ పీటర్ ఉత్తర్వులు జారీచేశారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకానికి ప్రభుత్వం రూ.20 కోట్ల 53 లక్షల, 36 వేలను కేటాయించింది. ఈ నిధుల నుంచి సెప్టెంబర్ నెలకు రూ.ఐదు కోట్ల 13 లక్షల 33వేలు మంజూరు చేశారు. వీటిలో ఎస్సీ సబ్‌ప్లాన్ నుంచి రూ. నాలుగు కోట్ల 20 లక్షల 74 వేలు, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద రూ. 92 లక్షల 59 వేలు సేకరించారు. గ్రామీణాభివృద్ధిశాఖ ద్వారా రాష్ట్రంలో చేపడ్తున్న అభివృద్ధి పనులకు సెప్టెంబర్ నెలకు సంబంధించి రూ.67 కోట్ల 71 లక్షల 59 వేలు కేటాయించారు.
సెర్ప్‌కు రూ.41.66కోట్లు విడుదల
పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)కు సెప్టెంబర్ నెల ఖర్చులకు సంబంధించి రూ.41కోట్ల 66 లక్షల 66 వేలను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించి సెర్ప్‌కు ప్రభుత్వం రూ.166 కోట్ల 66 లక్షల 66 వేల నిధులను కేటాయించింది. వీటిలో రూ.125 కోట్లను ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసింది. సెర్ప్‌కు కేటాయించిన నిధులలో ఎస్సీ సబ్‌ప్లాన్ నుంచి రూ. 20 కోట్ల 83 లక్షల 33 వేలు, ఎస్టీ సబ్‌ప్లాన్ నుంచి రూ.14 కోట్ల, 58 లక్షల 33 వేలు ఉన్నాయి.
అభయ హస్తం పథకానికి రూ.10.80 కోట్లు విడుదల
డ్వాక్రా మహిళల ప్రమాద బీమా, పింఛన్ పథకానికి (అభయ హస్తం) రూ.10 కోట్ల 79 లక్షల 98 వేలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వైఎస్సార్ అభయ హస్తం పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.43 కోట్ల19 లక్షల 99వేలు కేటాయించింది. వీటిలో ఇప్పటికే రూ.32 కోట్ల 39 లక్షల 98 వేలు విడుదల చేశారు. సెప్టెంబర్ నెలకు సంబంధించి విడుదల చేసిన నిధుల్లో ఎస్సీ సబ్‌ప్లాన్ నుంచి రూ.7 కోట్ల 23 లక్షల 73 వేలు, ఎస్సీ సబ్‌ప్లాన్ నిధుల నుంచి రూ. 38 లక్షల 98 వేలు కేటాయించారు.
ఐడీహెచ్ కాలనీకి రేపు సీఎం శంకుస్థాపన
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కాలనీవాసులకు ఇచ్చిన హామీ మేరకు సికింద్రాబాద్‌లోని ఐడీహెచ్ కాలనీకి దసరా పండుగ సందర్భంగా శంకుస్థాపన చేయనున్నారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 18వ సర్కిల్‌లో ఉన్న ఈ కాలనీని 1969లో ఇన్‌ఫెక్సియస్ డిసీసెస్ హాస్పిటల్ (ఐడీహెచ్) కాలనీగా నిర్మించారు. ఇందులో 360 కుటుంబాలు నివసించేలా ఆపార్టుమెంట్‌లు నిర్మించారు. సుమారు 45 ఏండ్ల కింద నిర్మించిన ఇండ్లు పూర్తిగా శిథిలమయ్యాయి. దీనిపై ఇటీవలే స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో కాలనీవాసులు సీఎం కేసీఆర్‌ను కలిసి తమ గోడు విన్నవించుకున్నారు. వెంటనే స్పందించిన సీఎం స్వయంగా ఐడీహెచ్ కాలనీకి వెళ్లి పరిశీలించి కొత్త ఇండ్లు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి నెలరోజులు కూడా గడువక ముందే అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఐడీహెచ్ కాలనీకి సీఎం శంకస్థాపన చేయాలని నిర్ణయించారు.
కొత్తగా 386 క్వార్టర్లను నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసి మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీచేశారు. ఐడీహెచ్ కాలనీతోపాటు పక్కనే ఉన్న మరో ఐదుకాలనీలలో కూడా పక్కా ఇండ్లను నిర్మించేందుకు ప్రభుత్వం నిధులను కేటాయించింది. ఐడీహెచ్ కాలనీలో 216, అమ్ముగూడలో 101, సుభాష్ చంద్రబోస్ కాలనీలో 26, భగత్‌సింగ్‌నగర్‌లో 12, పర్తివాడలో 31 ఇండ్లను నిర్మించాలని నిర్ణయించారు. వీరికి ఒక్కో కుటుంబానికి డబుల్ బెడ్ రూం, ట్రిబుల్ బెడ్‌రూంలను ప్రభుత్వం నిర్మించి ఇవ్వనుంది. ఒక్కో ఇంటికి సగటున రూ.9 లక్షల 22 వేలు ఖర్చవుతుందని అంచనా. కొత్త క్వార్టర్లతోపాటు కాలనీలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించేందుకు రూ.36 కోట్ల 54లక్షలను ప్రభుత్వం విడుదల చేసింది.
సిద్దిపేట, ఆందోల్ పీజీ సెంటర్లకు నిధుల కేటాయింపు
మెదక్ జిల్లా సిద్దిపేట్‌లోని పీజీ సెంటర్‌కు 2014-2015 సంవత్సరానికి సంబంధించి రూ.3 కోట్ల 55 లక్షలు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు మంగళవారం జీవో 161ను విడుదల చేస్తూ ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి వికాస్‌రాజ్ నిర్ణయం తీసుకున్నారు. అలాగే జోగిపేట, ఆందోల్ పీజీ సెంటర్‌కు రూ.2 కోట్ల 63 లక్షలు మంజూరు చేస్తూ మరో జీవో 160ను విడుదల చేశారు. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాలకు సంబంధించి బడ్జెట్ కేయించినట్లు జీవోలో పేర్కొన్నారు.
ఆర్ అండ్ బీ విభాగానికి రూ. 5.35 కోట్లు విడుదల
రోడ్లు భవనాల శాఖకు ప్రభుత్వం రూ. 5.35 కోట్ల నిధులను విడుదల చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను మంగళవారం ప్రభుత్వ కార్యదర్శి శివశంకర్ జారీచేశారు. 2014-15 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం నాన్ ప్లాన్ బడ్జెట్ కింద ఆర్ అండ్ బీ ఖర్చుల కోసం ఈ నిధులను విడుదల చేసినట్లు తెలిపారు.
Source: [నమస్తే తెలంగాణ]
