గృహనిర్మాణం, రేషన్ కార్డులు, పెన్షన్ల పంపిణీలో ఎలాంటి అవకతవకలు లేకుండా చర్యలు తీసుకోవాలని, గ్రామీణ స్థాయిలో ఆర్ధిక, సామాజిక స్థితిగతులపై ఆగస్టు నెలలో సమగ్ర సర్వే నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. ప్రభుత్వ పథకాల అమలుపై సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో గురువారం అపార్డులో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసే అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలు అసలైన లబ్ధిదారులకు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ పథకాల అమలు పారదర్శకంగా ఉండాలని, అవినీతికి ఆస్కారం ఉండకూడదని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు అమలుచేసిన కొన్ని తప్పుడు పద్దతుల వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలు అసలైన లబ్ధిదారులకు అందకుండా పోయాయని, అప్పటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉండకూడదని చెప్పారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని, కళ్యాణలక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వం ఇచ్చే 50వేల రూపాయలు ఏవిధంగా లబ్దిదారుల ఖాతాల్లోకి వెళ్తాయో, ఇతర సంక్షేమ పథకాలు కూడా అదేవిధంగా నేరుగా వారి ఖాతాలోకే వెళ్ళేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
బోగస్ రేషన్ కార్డులను ఏరివేసి కొత్త రేషన్ కార్డులను దసరా, దీపావళి పర్వదినాల మధ్య పంపిణీకి ఏర్పాట్లు చేయాలని, ప్రతీ ఒక్క కుటుంబం వివరాలు ఖచ్చితంగా సేకరిస్తే సంక్షేమ పథకాలు సరిగ్గా అమలవుతాయని అన్నారు. విదేశాల్లో మల్టీ పర్పస్ కార్డులు ఇస్తున్నట్లే రాష్ట్రంలో కూడా తెలంగాణ సిటిజన్ కార్డులను ప్రజలకు జారీ చేస్తామని సీఎం తెలిపారు. ఈ సమావేశంలో సీఎం ముఖ్యకార్యదర్శి బీ నర్సింగరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ప్రభుత్వ సలహాదారులు బీవీ పాపారావు, ఏకే గోయల్, సీనియర్ ఐఏఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.