mt_logo

సీమాంధ్రకు కొత్తవి- తెలంగాణకు డొక్కువి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా తెలంగాణపై సీమాంధ్ర పెత్తనం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవలే అటవీశాఖ కొనుగోలు చేసిన 50 కొత్త వాహనాలైన బోలేరో, స్కార్పియో, జీప్ లన్నిట్నీ రాయలసీమకు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం కిరణ్ రాజీనామా చేసే కొద్ది రోజులముందు హడావిడిగా ఈ వాహనాల కొనుగోలు ఫైలుపై సంతకం చేయగా నాలుగు కోట్లు వెంటనే శాంక్షన్ అయ్యాయి. రాయలసీమలో ఎర్రచందనం స్మగ్లింగ్ సాకుచూపి వాహనాలను సీమకు తరలించారు. అదేమిటని అడిగితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణవాదులు మండిపడుతున్నారు. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ బీఎస్ఎస్ రెడ్డి రాయలసీమకు చెందిన వ్యక్తి కావడంవల్ల ఆయన ఆదేశాలమేరకే వాహనాలు తరలించారని అంటున్నారు. తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాల ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల విభజన తదితర అంశాలు ఒక కొలిక్కిరాకుండానే ఇలా చేయడం సీమాంధ్రుల వక్రబుద్ధిని తెలుపుతుందని తెలంగాణ వాదులు ఆరోపిస్తున్నారు. తెలంగాణలో విస్తారంగా అడవులు ఉన్నాయని, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాల్లో టేకుచెట్ల స్మగ్లింగ్ భారీగా జరుగుతుందని, కొన్నిసార్లు అధికారులు ప్రాణాలు కూడా కోల్పోతున్నారని, స్మగ్లర్లను అడ్డుకోవడానికి తెలంగాణ ప్రాంతంలో కూడా కొత్త వాహనాల అవసరం ఉండగా సీమకే ఎందుకు వాహనాలు తరలిస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. కొత్తవాహనాలను సీమకు తరలించిన విషయం తెలుసుకున్న తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు వీ శ్రీనివాస్ గౌడ్ అటవీశాఖ పీసీసీఎఫ్ బీఎస్ఎస్ రెడ్డిని కలిసి ఆటవీశాఖలో జరిగే గోల్ మాల్ పై విజిలెన్స్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని, తెలంగాణకు అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *