-మరమగ్గాల ఆధునీకరణకు, ఉపాధి పని దినాల పెంపునకు సహకరించండి
– కేంద్రానికి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి
– విద్యుత్‌పై త్రిముఖ వ్యూహం అనుసరిస్తున్నామని వెల్లడి
గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా చితికిపోయిన చేనేత రంగాన్ని ఆదుకోవాలని కేంద్రప్రభుత్వానికి పంచాయతీరాజ్-ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు విజ్ఞప్తి చేశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వచ్చిన కేటీఆర్ వివిధ శాఖలకు చెందిన కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి ఆర్థిక సాయంతోపాటు కొత్త పథకాలను ప్రవేశపెట్టాల్సిందిగా కోరారు. మంగళవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి గ్రామీణాభివృద్ధికి సంబంధించిన అంశాలపై విజ్ఞాపన పత్రాలను అందజేశారు. జౌళిశాఖ మంత్రి సంతోష్‌కుమార్ గాంగ్వర్‌ను కలిసి చేనేత, మరమగ్గాల అంశాలకు సంబంధించి కూలంకషంగా చర్చించారు. మరమగ్గాల ఆధునీకరణకు ఇప్పటివరకూ కేంద్రం ఇస్తున్న రూ.15వేలను రూ.1.50 లక్షలకు పెంచాలని, గ్రూప్ వర్క్‌షెడ్‌ల స్థానంలో వ్యక్తిగత వర్క్‌షెడ్‌లను ప్రవేశపెట్టి ఆర్థిక సాయం చేయాలని కోరారు.
గత ప్రభుత్వాల వైఫల్యంతోనే విద్యుత్ సంక్షోభం
అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ సమస్య అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వారసత్వంగా వచ్చిందని, గత ప్రభుత్వాలకు ముందుచూపు కొరవడిన కారణంగానే సంక్షోభం స్థాయికి విద్యుత్ కొరత చేరుకున్నదని అన్నారు. ఇప్పుడు ఈ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ప్రభుత్వం త్రిముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్నదని పేర్కొన్నారు. స్వల్పకాల పరిష్కారంగా వెంటనే సౌర విద్యుత్ కేంద్రాలను నెలకొల్పి, ఏడాదికల్లా వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నదని తెలిపారు. నూతన విద్యుత్ పాలసీలో భాగంగా సౌర విద్యుత్ ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు.
మధ్యకాల పరిష్కారంగా ఛత్తీస్‌గఢ్‌లాంటి రాష్ట్రాల్లో అదనంగా ఉన్న విద్యుత్‌ను కొనుగోలు చేయాలని భావిస్తున్నదన్నారు. దీర్ఘకాల పరిష్కారంగా రానున్న నాలుగేళ్లలో 12 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని, అందులో భాగంగానే రామగుండంలో 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించడంతోపాటు తెలంగాణ జెన్ కో ద్వారా మరో 8,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నాఫ్తాల్‌తో విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలన్న ఆలోచన ఉన్నదని, దిగుమతి చేసుకోవడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుందని, ఉత్పత్తికి వ్యయం ఎక్కువ అవుతున్నప్పటికీ అన్ని కోణాల నుంచి ఆలోచించి సంక్షోభ నివారణకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నదన్నారు.
సిరిసిల్లకు ఆర్థికసాయం పెంచాలి
తెలంగాణ షోలాపూర్‌గా పేరుగాంచిన సిరిసిల్లలో నేటికీ కాలం చెల్లిన మరమగ్గాలతోనే వస్త్రాలు ఉత్పత్తి అవుతున్నాయని అన్నారు. యంత్రాల ఆధునీకరణకు కేంద్ర ప్రభుత్వం ఒక్కో యంత్రానికి రూ.15వేలు ఆర్థిక సాయం చేస్తున్నదన్నారు. ఈ సాయాన్ని రూ.1.50 లక్షలకు పెంచాల్సిందిగా కేంద్ర జౌళి శాఖ మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వర్‌కు విజ్ఞప్తి చేశామని, ఆయన సానుకూలంగా స్పందించారని కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణలో ఉన్న మొత్తం 50 వేల మరమగ్గాల్లో సిరిసిల్ల పట్టణంలోనే 36 వేలు ఉన్నాయని, వీటిని సెమీ ఆటోమేటిక్‌గా మార్చాల్సిన అవసరం ఉందని తెలిపారు.
సిరిసిల్లలో నేతపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు ఇరవై వేలు ఉన్నాయని, 90% మేర పాలిస్టర్ చీరలు, షర్టింగ్, కర్టెన్లు తదితర దుస్తులను ఉత్పత్తి చేస్తున్నాయని, వార్షిక వ్యాపారం సుమారు రూ.300 కోట్ల మేరకు ఉన్నదని అన్నారు. మరమగ్గాల ఆధునీకరణకు రూ.180 కోట్లు అవసరమవుతుందని, ఒక్కో పవర్ లూమ్ స్థాపనకు ప్రారంభ పెట్టుబడి కనీసంగా రూ.50వేలు అవసరమని.. ఈలెక్కన మొత్తం 2వేల యూనిట్లకు (ఒక్కో యూనిట్‌కు ఆరు పవర్ లూమ్ యంత్రాలుగా లెక్కగడితే) రూ. 60 కోట్లు ఖర్చవుతుందని, మొత్తంగా రూ.240 కోట్ల సాయంగా ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. గత కేంద్ర ప్రభుత్వం సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటుకు హామీ ఇచ్చిందని, దీనిపై రానున్న బడ్జెట్‌లో హామీ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.
టెక్స్‌కో ఏర్పాటుకు చర్యలు
వస్త్రాల ఉత్పత్తి వ్యయం పెరగడంతోపాటు నేతన్నలకు మార్కెటింగ్ సౌకర్యం సరిగా లేదని మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య నివారణకు గతంలో పనిచేసిన టెక్స్‌కో వ్యవస్థను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నదని, ఇది చర్చల స్థాయిలోనే ఉన్నదని తెలిపారు. ఈ పథకం ద్వారా నేత కార్మికులు తయారు చేసిన వస్త్రాన్ని ప్రభుత్వమే గరిష్ఠ మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న డిజిటల్ ఇండి యా గురించి కేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్రం ఈ ప్రకటన చేయడానికి ముందే రాష్ట్రంలోని సుమారు 2,400 గ్రామాలను ఇ-పంచాయతీలుగా మార్చుతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. హైదరాబాద్ నగరంలో వై-ఫై సౌకర్యం కూడా కేంద్రప్రభుత్వం కంటే ముందే ప్రకటించిందని గుర్తు చేశారు. ప్రధాని మోడీ ఇటీవల ప్రకటించిన స్వచ్ఛ భారత్ – స్వాస్థ్య భారత్ పథకం ఆహ్వానించదగినదన్నారు. ఇందులో భాగంగా వచ్చే సంవత్సరం ఆగస్టు 15వ తేదీకల్లా అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లను తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తుందని, 2019కల్లా అన్ని ఇళ్లకు మరుగుదొడ్ల సౌకర్యాన్ని కల్పిస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
సోమవారం జరిగిన సమావేశంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.15వేలు ఇవ్వాలని, పాఠశాలల మరుగుదొడ్లకు రూ.10వేలకు బదులుగా రూ.60వేలు ఇవ్వాల్సిందిగా ప్రతిపాదించానని, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించి ఒక్క రోజులోనే రూ.50వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారని తెలిపారు. తాగునీటి అవసరాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.24వేలకోట్ల అంచనాతో చేపట్టిన వాటర్ గ్రిడ్‌కు 50% నిధులను కేంద్రం భరించాల్సిందిగా కోరామని, ఇందుకు మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారని తెలిపారు.
ఉపాధి పని దినాల పెంపు
రాష్ట్రంలో కరువు ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయని, జాతీయ ఉపాధి హామీ పథకాన్ని 100 రోజులకు బదులుగా 150 రోజులకు పెంచాలని కోరినట్లు తెలిపారు. ఇప్పుడు ఈ పనుల్లో 60% కార్మికులు, 40% యంత్రాల వినియోగం జరుగుతున్నదని, దీన్ని 50:50కు సవరించాల్సిందిగా కోరానని.. దీనిని 49:51గా మార్చడానికి ప్రయత్నిస్తానని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. ఉద్యోగుల విభజన ఇంకా పూర్తిస్థాయిలో జరగనందున వెనకబడిన ప్రాంతాల గ్రాంట్ల వివరాలను సమర్పించడానికి సెప్టెంబర్ 15వ తేదీ వరకు గడువు ఇచ్చారని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని 1279 గ్రామాలకు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద రహదారులు నిర్మించకుండానే పనులు పూర్తిచేసినట్లు గత ప్రభుత్వం తప్పుడు నివేదిక ఇచ్చిందని.. ఫలితంగా ఆ గ్రామాలకు రోడ్లు లేకుండా పోయాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై తక్షణమే చర్యలు తీసుకుని వీలైనంత త్వరగా ఆ గ్రామాలకు రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని మంత్రి నితిన్ గడ్కరీని కోరినట్లు కేటీఆర్ తెలిపారు. అదనంగా మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో 2736 కి.మీ.మేర రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని విన్నవించారు.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..