తెలంగాణ ప్రభుత్వ దవాఖానలో పురుడు పోసుకుంటున్న పొరుగు రాష్ట్రాల ఆడబిడ్డల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక టెక్నాలజీ గల వైద్య సదుపాయాలు కల్పించడంతోపాటు, సాధారణ ప్రసవాలకు పెద్దపీట వేస్తున్నారు. కానీ, మన పొరుగునే ఉన్న మహారాష్ట్రలో ఈ పరిస్థితి లేదు. అక్కడ ప్రభుత్వ దవాఖానలు అందుబాటులో లేక.. ఒకవేళ ఎక్కడో దూరంగా ఉన్నా వాటిలో సరైన సదుపాయాలు లేక ఎంతో మంది ఆడబిడ్డలు రాష్ట్ర సరిహద్దులు దాటి వచ్చి ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు చేయించుకొంటున్నారు. గత ఐదేండ్లలో ఇలాంటివారి సంఖ్య పదుల నుంచి వేలలోకి పెరిగింది. ఒక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఏటా వెయ్యిమందికిపైగా మహారాష్ట్ర వాసులు పురుడుపోసుకుంటున్నట్టు క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. ఈ జిల్లాల్లో జరుగుతున్న మొత్తం ప్రసవాల్లో 20% మహారాష్ట్ర వాసులవేనని వెల్లడైంది. వీటిలో క్రిటికల్ కేసులే ఎక్కువగా ఉంటున్నాయని వైద్యులు చెప్తున్నారు. గతంతో పోలిస్తే స్వరాష్ట్రంగా ఏర్పడ్డాక తెలంగాణలో దవాఖానలు ఎంతో మెరుగుపడ్డాయని, మంచి వైద్యులతోపాటు అధునాతన వసతులు అందుబాటులోకి వచ్చాయని ఆ మహిళలు అంటున్నారు. ముఖ్యంగా బాలింతలకు ఇస్తున్న కేసీఆర్ కిట్టు ఎంతో బాగున్నదని, తెలంగాణలోని అన్ని రంగాల్లో అద్భుత పాలన కనిపిస్తున్నదని ప్రశంసిస్తున్నారు. పొరుగు రాష్ట్రంలో పుట్టినప్పటికీ తమ ప్రసవ వేదన తీరుస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని చెప్తున్నారు.
![](https://i0.wp.com/missiontelangana.com/wp-content/uploads/2022/11/image-4.png?resize=529%2C311&ssl=1)