mt_logo

నేడు, రేపే కాదు భవిష్యత్తు కూడా మనదే – సీఎం కేసీఆర్

తెలంగాణ గడ్డ మీద టీఆర్ఎస్ తప్ప మరో రాజకీయ పార్టీకి భవిష్యత్తు లేదని, ముందుముందు కూడా టీఆర్ఎస్ పార్టీకే ప్రజలు పట్టం కడతారని టీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తేల్చిచెప్పారు. మంగళవారం సికింద్రాబాద్ లోని కొంపల్లిలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, భారీగా హాజరైన పార్టీ శ్రేణులను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, ప్రతిపక్షాలు ఏమీ తోచక మాట్లాడుతున్నారే తప్ప, రాష్ట్ర ప్రజలు వారిని అసలు నమ్మే పరిస్థితే లేదని, 2019 ఎన్నికల్లో 154 అసెంబ్లీ స్థానాలకు 135 నుండి 140 స్థానాలు మనమే గెలుస్తామని చెప్పారు.

పార్టీలోని ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధి అనే మూడు లక్ష్యాలను పెట్టుకుందని, వచ్చే బడ్జెట్ అనంతరం దళితులకు భూ పంపిణీ ఉధృతం చేస్తామన్నారు. అంతేకాకుండా అమరవీరుల కుటుంబాలకు అందించే సహాయానికి సంబంధించి సెకండ్ ఫేజ్ ఎంపిక ప్రారంభించాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. ఎన్నికల మానిఫెస్టోలో చెప్పనివి, ఎవరూ డిమాండ్ చేయకున్నా కొన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, మానవతా దృక్పథంతో సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, ఇప్పుడు ఆ పిల్లలు సంతోషంగా ఉన్నారని కేసీఆర్ పేర్కొన్నారు.

మూడేళ్ళు దాటితే 24 గంటల కరెంట్ ఇస్తామని, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై తెలంగాణ సాంస్కృతిక సారధితో విస్తృత ప్రచారం నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. మూడేళ్ళలో 120 మొక్కలు నాటాలని, హరితహారంతో పాటు మిషన్ కాకతీయపై కూడా సాంస్కృతిక సారథి విస్తృతంగా ప్రచారం చేస్తుందని, వారితో పాటు ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు అందరూ భాగస్వాములు కావాలని సీఎం స్పష్టం చేశారు. ప్రజల సామూహిక అవసరాల కోసమే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయని, ప్రజల భూమిని ఎట్లా వాడాలో మీకు తెలియలేదని, మేం చేద్దామంటే విమర్శలని ప్రతిపక్షాలను దుయ్యబట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *