mt_logo

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా గోదావరి పుష్కరాలు

జూలై 14 నుండి 25వ తేదీ వరకు జరగనున్న గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలని, నెలరోజుల ముందుగానే అన్ని ఏర్పాట్లను చేయాలని, పుష్కర ఘాట్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. సోమవారం సచివాలయంలో కమిటీ చైర్మన్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో గోదావరి పుష్కరాలపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. వివిధ శాఖలు చేపట్టాల్సిన పనులకు నిధుల కొరత లేకుండా చూడాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది.

పుష్కరాల కోసం ప్రభుత్వం రూ. 425 కోట్ల రూపాయలను కేటాయించింది. ఇందులో ఆర్అండ్ బీ శాఖకు రూ. 226 కోట్లు, నీటిపారుదల శాఖకు రూ.82 కోట్లు, పంచాయితీ రాజ్ శాఖకు రూ. 100 కోట్లు చొప్పున కేటాయించారు. గతంలో నిర్వహించిన పుష్కరాల్లో కేవలం 27 పుష్కర ఘాట్లను నిర్మించగా, ఈ సారి 69 ఘాట్లను నిర్మించాలని నిర్ణయించారు. అంతేకాకుండా మరో పదిచోట్ల కూడా ఘాట్లు నిర్మించేందుకు ప్రతిపాదనలు పరిశీలిస్తున్నారు.

సమావేశం అనంతరం క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా నిధులు కేటాయించిందని, ఇంకా అవసరం ఉన్నందున ప్రత్యేకంగా నిధులు కేటాయించాల్సిందిగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును కోరుతామని తెలిపారు. దేశవిదేశాల నుండి భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని, తెలంగాణలో చేపట్టే ఈ కార్యక్రమాలకు రాష్ట్రపతి, ప్రధాని, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను, మఠాధిపతులను, పీఠాధిపతులను ఆహ్వానిస్తామని చెప్పారు. దీనికోసం ప్రత్యేకంగా వెబ్ సైట్ ను రూపొందిస్తున్నామని, పూర్తి వివరాలను అందులో చూడొచ్చని ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్, ఆర్అండ్ బీ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ సలహాదారు రమణాచారి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *