By – డా. గాదగాని నరేష్
—
ఇదే ఈ దేశ రాజకీయం… కమ్యూనిస్ట్ లకు కాషాయం అంటే అసలు పడదు, కాషాయం అంటే కమ్యునిస్ట్ లకు అంతే. కాంగ్రెస్ అంటే కాషాయానికి పడదు, కాషాయం అంటే కాంగ్రెస్ కు పడదు.
అప్పుడప్పుడు కాంగ్రెస్ తో కమ్యునిస్టులు కలుస్తారు. కాని ఆ బంధం కొంత కాలమే. కమ్యూనిస్ట్ లలో అంతర్గత కుమ్ములాటలు , ఇప్పుడిప్పుడే మొదలవుతున్న కాషాయ అంతర్గత కుమ్ములాటలు. కాంగ్రెస్ పై 2009లోనే చాలా వ్యతిరేకత ఉండింది. కాని కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ ఈ దేశంలో ఎక్కడ గెలిచినా కూడా అది దాని గొప్పతనం ఏ మాత్రం కాదు. కేవలం ప్రత్యర్థి బలహీనత మాత్రమే.
అద్వానిలాంటి నాయకుడికి ఇన్నాళ్లకు అర్థమయ్యింది. మనం ఎంత ప్రయత్నం చేసినా మన మీద “ఆ ” ముద్ర ఉన్నంత కాలం ఈ దేశాన్ని ఏలే అవకాశం కమలనాధులకు వచ్చే అవకాశం తక్కువ అని. జీవితకాల రాజకీయ అనుభవంతో చెప్తున్న అద్వాని మాటలు అనుభవం లేని కార్యకర్తలకు అంత తొందరగా అర్థం కాదు. దాంట్లో ఆశ్చర్యం కూడా లేదు.
కేవలం కొన్ని వర్గాల, కులాల , మతాల వారిగా వోట్లు పొందడం కాంగ్రెస్ కి తెలిసినంతగా ఎవరికీ తెలియదేమో. నిజంగా ఎందుకు BJP ప్రత్యామ్నాయం కాలేకపోతుంది అనే కోణంలో ఆలోచిస్తే ఆ విషయం తెలుస్తుంది. BJPలో మోడీ వల్ల కొన్ని సీట్లు పెరగొచ్చు కాని, NDA కూటమిని సమర్థవంతంగా నడుపగలరా అనేది పెద్ద సందేహం.
BJP నాయకుల్లో కాని, కార్యకర్తల్లో కాని పెద్దగా మోడీకి వ్యతిరేకత ఉండకపోవచ్చు కాని, చాలా NDA పక్షాలు మోడీ నాయకత్వాన్ని అంత తేలికగా జీర్నిచుకోలేకపోతున్నాయి. దీని విషయంలోనే అద్వాని ఆందోళన చెందుతున్నారు. BJPకి ఎక్కువ సీట్స్ రావడం కాదు విషయం, NDA ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడమే కీలకం. కాంగ్రెస్ లాంటి జిత్తులలమారి పార్టీ మోడీని బూచిగా చూపి ఎన్నికల ముందు దేశ ప్రజలను, ఎన్నికల తరువాత గెలిచిన పక్షాలను, వాళ్ళ MPలను ఏ తీరుగానైనా మోసం చెయ్యొచ్చు.
కమ్యునిస్టులనే కనుక, కాంగ్రెస్, కాశాయం రెండింట్లో ఒకదాన్ని పట్టుకోమ్మంటే వాళ్లు కాంగ్రెస్ నే పట్టుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో NDA పక్షాలను ఒక్క తాటి పైకి తెస్తేనే విజయం. NDA పక్షాల, ప్రాంతీయ పార్టీల బలం లేకుండా కాంగ్రెస్ ని దింపే పరిస్థితి చాల తక్కువ. కాంగ్రెస్ ని మట్టికరిపించాలంటే మోడీ ఒక్కడి వల్లనో, BJP వల్లనో కాదు, కచ్చితంగా ప్రాంతీయ శక్తులను కలుపుకొని పోతేనే కాంగ్రెస్ పతనాన్ని ఈ దేశం చూడగలుగుతుంది.