mt_logo

విశాలాంధ్ర విషానికి విరుగుడు విడుదల!

సచ్చిన సమైక్యవాదాన్ని పరకాల ప్రభాకర్‌లాంటి కుహనా మేధావులు ఇంటెన్సివ్ కేర్‌లో పెట్టి బతికించే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఓ పక్క ఆయన సతీమణి బీజేపీలో ఉంటూ తెలంగాణ ఇచ్చేది మేమే అని బాహాటంగా ప్రకటనలు చేస్తుంటే.. మరోపక్క ప్రభాకర్ తెలంగాణవాదమే లేదంటూ దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ, పీఆర్పీలాంటి రాజకీయ పార్టీలు, పలు చానళ్లు మారిన ప్రభాకర్‌కు తెలంగాణ చరిత్ర ఏం తెలుసని ప్రశ్నించారు.

కాగా, ప్రముఖ రచయిత, వీక్షణం సంపాదకుడు ఎన్ వేణుగోపాల్ రచించిన ‘విద్వేషమే ధ్యేయంగా విశాలాంధ మహారభస- పచ్చి అబద్ధాల పరకాలకు అసలు నిజాల జవాబు’ పుస్తకాన్ని తెలంగాణ ఆత్మగౌరవ వేదిక ఆధ్వర్యంలో మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ జర్నలిస్టు ఫోరం ప్రధాన కార్యదర్శి సీహెచ్ క్రాంతికిరణ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హరీశ్‌రావు మాట్లాడుతూ.. పరకాల ప్రభాకర్‌లాంటి కుహనా మేధావులు సృష్టించిన నాన్‌సెన్స్, న్యూసెన్స్‌ను వేణుగోపాల్ శాస్త్రీయంగా తిప్పికొట్టారని అన్నారు. అసెంబ్లీ సెషన్‌లో ఈ పుస్తకాన్ని శాసనసభ్యులందరికీ పంపిణీ చేస్తానని హరీశ్‌రావు ప్రకటించారు.

అనంతరం ‘నమస్తే తెలంగాణ’ సంపాదకుడు అల్లం నారాయణ మాట్లాడుతూ.. తెలంగాణలో కొనసాగుతున్న వలసాధిపత్యాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పరకాల ప్రభాకర్ రాసిన అబద్ధాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఇప్పటికే చాలాసార్లు, చాలా వేదికలపై తెలంగాణవాదులు సమాధానం చెప్పారని గుర్తు చేశారు.

తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికే బెల్లి లలితను ముక్కలు చేశారని, కనకాచారిని పొట్టనపెట్టుకున్నారని తెలంగాణవాదాన్ని పాటలరూపంలో వినిపించిన ప్రజాగాయకుడు గద్దర్‌పై కాల్పులు జరిపి రక్తపాతాన్ని సృష్టించారని అన్నారు. ఈనెల 14న చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి టీజేఎఫ్ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు.

టీఎన్‌జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ ఎన్ని కేసులు పెట్టినా చలోఅసెంబ్లీని నిర్వహించి తీరుతామని అన్నారు. ప్రొఫెసర్ గంటా చక్రపాణి మాట్లాడుతూ తాను పరకాలను ఓ మనిషి చూడడం లేదని అన్నారు.

పుస్తక రచయిత ఎన్ వేణుగోపాల్ మాట్లాడుతూ.. పరకాల ప్రభాకర్‌కు జవాబు చెప్పలేకపోతే తెలంగాణలో జవాబు లేదని అంటారన్న ఉద్దేశంతోనే ఈ పుస్తకాన్ని రాశానని అన్నారు. 1997లో కాకినాడలో బీజేపీ పార్టీ తెలంగాణపై తీర్మానం చేసినప్పుడు పరకాల, ఆయన సతీమణి జై తెలంగాణ అన్నారని గుర్తు చేశారని అన్నారు. పుస్తకావిష్కరణ చేసిన కాంత్రికిరణ్ మాట్లాడుతూ.. తెలంగాణ అమరవీరుల త్యాగాలను కించపరిచేలా పరకాల పుస్తకం రాశారని విమర్శించారు. కార్యక్రమానికి తెలంగాణ హిస్టరీ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ తడకమళ్ల వివేక్ అధ్యక్షత వహించగా తెలంగాణ ఆత్మగౌరవ వేదిక కన్వీనర్ బాల్‌రెడ్డి, విరసం నేత వరవరరావు, నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ మాడభూషి శ్రీధర్, పలువురు జర్నలిస్టులు హాజరయ్యారు.

[నమస్తే తెలంగాణ సౌజన్యంతో]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *