-ఇక నదుల నీళ్లే మంచితీర్థం
– తెలంగాణ వాటర్‌గ్రిడ్‌కు వ్యూహరచన
– పది జిల్లాలకు తాగునీరందించే బృహత్‌పథకం
– త్వరలో సీఎం ముందుకు రానున్న నివేదిక
– 2051 నాటి డిమాండ్‌కు తగిన ప్రణాళిక
– గ్రావిటీ, పంపింగ్ విధానాలతో అన్ని గ్రామాలకు
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు నదులనుంచి నీరందించే బృహత్‌పథకం సిద్ధమైంది. ఈ పథకం ప్రకారం రాష్ట్రంలోని పది జిల్లాలను కలుపుతూ ఒక వాటర్‌గ్రిడ్ ఏర్పాటు చేస్తారు. దీనికి వివిధ నదులనుంచి నీరు సేకరించి ఈ గ్రిడ్ ద్వారా పది జిల్లాల్లో ప్రతి గ్రామానికి ఆ నీరు సరఫరా చేస్తారు. ఈ పథకానికి సంబంధించిన ఫైలు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ముందుకు త్వరలో రానుంది. రాష్ట్రంలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి వాటర్‌గ్రిడ్ ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే.
ముఖ్యమంత్రి సూచనల మేరకు సాంకేతిక నిపుణుల నేతృత్వంలో ఈ మహాప్రణాళికకు రూపకల్పన జరిగింది. ఈ నివేదికను జలమండలి ఇన్‌చార్జ్ ఎండీ జగదీశ్వర్ త్వరలోనే సీఎం కేసీఆర్ ముందుంచనున్నారు. ఈ పథకం అమలులోకి వస్తే రాష్ట్రంలో మారుమూల పల్లె నుంచి హైదరాబాద్ నగరం దాకా ఇంటింటికీ నదుల నీరు రక్షిత జలాల రూపంలో అందుతుంది. తెలంగాణ వాటర్ గ్రిడ్‌గా పిలిచే ఈ పథకానికి గుజరాత్ రాష్ట్రంలో ప్రస్తుతం అమలులో ఉన్న తాగునీటి గ్రిడ్‌ను ఆదర్శంగా తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో వ్యక్తికి 70 లీటర్లు, పట్టణ నగరాల్లో 150 లీటర్ల నీరు అందిస్తారు. ఈ పథకానికి 2021, 2031, 2041, 2051 సంవత్సరాలకు సరిపోయే విధంగా కార్యాచరణను రూపొందిస్తున్నారు.
ఏ నది నుంచి ఎంత?
రాష్ట్రంలో ఉన్న నదుల్లో ఎక్కడి నుంచి? ఏ పాయింట్ నుంచి ఎంత నీటిని తీసుకోవచ్చునన్న దానిపై నిపుణులు అధ్యయనం చేశారు. కృష్ణానది నుంచి జూరాల రిజర్వాయర్, కల్వకుర్తి ఎల్‌ఐఎస్ పాయింట్, శ్రీశైలం రిజర్వాయర్, నాగార్జునసాగర్ రిజర్వాయర్, పాలేరు, నాగార్జునసాగర్ ఎడమ కాల్వ(పాక్షికం)ల నుంచి నీటిని సేకరించే అవకాశముందని తేలింది. అలాగే గోదావరి నది నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్, ఎల్లంపల్లి/ప్రాణహిత, దేవాదుల ఎల్‌ఐఎస్, దుమ్ముగూడెం ఎల్‌ఐఎస్‌ల నుంచి తీసుకోవచ్చు. ఇక మంజీరా నది నుంచి సింగూరు, నిజాంసాగర్‌ల ద్వారా మంచినీటి సరఫరాకు అవసరమైన నీటిని పొందవచ్చు.
2021నాటికి 122 టీఎంసీలు అవసరం: రాష్ట్రంలో తాగునీటి అవసరాలు గమనిస్తే 2021వరకు 122.04 టీఎంసీలు అవసరమని అంచనా. అందుకోసం జూరాలనుంచి 9.5 టీఎంసీలు, కల్వకుర్తి నుంచి 3 టీఎంసీలు, శ్రీశైలం నుంచి 6.7 టీఎంసీలు, నాగార్జునసాగర్ నుంచి 33.46 టీఎంసీలు, దుమ్ముగూడెం నుంచి 4 టీఎంసీలు, దేవాదుల నుంచి 8.4 టీఎంసీలు, ప్రాణహిత/ఎల్లంపల్లి నుంచి 32.58 టీఎంసీలు, ఎస్‌ఆర్‌ఎస్పీ నుంచి 13.83 టీఎంసీలు, నిజాంసాగర్ నుంచి 4.35 టీఎంసీలు, సింగూరు నుంచి 5 టీఎంసీలు, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల నుంచి 1.2 టీఎంసీలు తీసుకునే వీలుందని అధికారులు గుర్తించారు.
సరఫరా ఎలా?: ఆయా ప్రాంతాలనుబట్టి గ్రావిటీ ద్వారా ఎంఎస్ పైపులైన్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు. అవసరమైన చోట పంపింగ్ విధానానికి రూపకల్పన చేస్తారు. మెయిన్ ట్రాన్స్‌మిషన్ గ్రిడ్ నుంచి జిల్లా కేంద్రాలకు, అక్కడి నుంచి మండల కేంద్రాలకు సరఫరా చేస్తారు. అటునుంచి గ్రామస్థాయి వరకు చేర్చాలని యోచిస్తున్నారు. దీనికోసం పక్కా నిర్వహణ వ్యవస్థలను రూపొందిస్తారు. అలాగే ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్‌మిషన్ గ్రిడ్, డిస్ట్రిక్ట్ గ్రిడ్, మండల్ గ్రిడ్‌లను మెయిన్ గ్రిడ్‌కు అనుసంధానం చేస్తారు.
బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, సర్వీసు రిజర్వాయర్లు, పంపు హౌజ్‌లు, విద్యుదీకరణ సదుపాయాలు అనివార్యం. వీటి ఏర్పాటుకు ఏ పాయింట్లు సరైనవో కూడా గుర్తిస్తారు. మెయిన్ రిజర్వాయర్లు, సర్వీసు రిజర్వాయర్లు, పంపింగ్ స్టేషన్ల నిర్మాణానికి, పైపులైన్ల ఏర్పాటుకు కూడా స్థల సేకరణ జరుపాల్సి ఉంటుంది. ఏ గ్రిడ్ నుంచి ఏయే జిల్లాలకు?: కృష్ణా డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ ద్వారా మహబూబ్‌నగర్, రంగారెడ్డి(పాక్షికం), నల్లగొండ, ఖమ్మం (పాక్షికం), హైదరాబాద్ జిల్లాలకు మంచినీటిని అం దించొచ్చు. గోదావరి డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ ద్వారా ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి(పాక్షికం), హైదరాబాద్ జిల్లాలకు సప్లయి చేయొచ్చు.
ఇదీ జనాభా పెరుగుదల తీరు..: తెలంగాణలో జనాభా నానాటికీ పెరుగుతోంది. 2021 నాటికి 5.7 కోట్లు అంటే 7 శా తం పెరుగుతుందని అంచనా. 2031 నాటికి 6.1 కోట్లు, 2041 నాటికి 6.6 కోట్లు, 2051 నాటికి 7 కోట్ల దాకా పెరుగుతుందని భావిస్తున్నారు. ఇదే క్రమంలో నీటి వినియోగం కూడా పెరుగుతోంది. 2014 నాటికి 116 టీఎంసీలు, 2021 నాటికి 122 టీఎంసీలు, 2031 నాటికి 130 టీఎంసీలు, 2041 నాటికి 140 టీఎంసీలు, 2051 నాటికి 150 టీఎంసీల నీళ్లు అవసరం అవుతాయని ప్రభుత్వ అంచనా. హైదరాబాద్ ప్రజల దాహార్తికి తీర్చేందుకు నాగా ర్జునసాగర్, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల తో జురాల ప్రాజెక్టులు కీలకం కానున్నాయి.
రంగారెడ్డి జిల్లా విషయానికొస్తే సింగూరు, ఎల్లంపల్లి/ ప్రాణహిత, మహబూ బ్‌నగర్‌కు జురాల, కల్వకుర్తి, శ్రీశైలం, మెదక్‌కు మంజీరా, ఎస్‌ఆర్‌ఎస్‌పీ, ఎల్లంపల్లి/ ప్రాణహిత, వరంగల్‌కు ఎస్‌ఆర్‌ఎ స్‌పీ, దేవాదుల, ఖమ్మంకు నాగార్జున సాగర్-పాలేరు-దుమ్ముగూడెం, కరీంనగర్‌కు ఎస్‌ఆర్‌ఎస్‌పీ/ నిజాంసాగర్/ ఎల్లంపల్లి/ ప్రాణహిత, నిజామాబాద్‌కు నిజాంసాగర్/ ఎల్లం పల్లి/ ప్రాణహిత, ఆదిలాబాద్‌కు ఎస్‌ఆర్‌ఎస్‌పీ, ప్రాణహిత ద్వారా దాహార్తిని తీర్చవచ్చని అంచనా. 2021 సంవత్సరానికిగానూ జూరాల రిజర్వాయర్ వద్ద 2.50టీఎంసీ సామర్థ్యం కలిగిన నీటి శుద్ధి కేంద్రం, జురాల యూనిట్ -2వద్ద 2.50, కల్వకుర్తి పథకంతో 2.50, శ్రీశైలం రిజర్వాయర్ యూనిట్ 1కు 10.00, యూనిట్-2 అదనంగా మరో 10 టీఎంసీల నీటిశుద్ధి కేంద్రం అవసరం.
దీంతో పాటు నాగార్జున సాగర్ రెండు యూనిట్ల ద్వారా 26.50, దమ్ముగూడెం ఫౌండ్ బ్యారేజి వద్ద 5, దేవాదుల (గోదావరి నది) వద్ద ఐదు, ప్రాణహిత 10, ఎల్లంపల్లి బ్యారే జి 5, ఎస్‌ఆర్‌ఎస్‌పి రెండు యూనిట్ల వద్ద 20, నిజాంసాగర్ 7.50, సింగూరు రిజర్వాయర్ వద్ద 6.96 టీఎంసీలు కలిపి మొత్తం 82.50 టీఎంసీల సామర్థ్యం కలిగిన వాటర్ ట్రిట్‌మెంట్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు.
ఢిల్లీ పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్
రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హస్తిన పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 6, 7 తేదీల్లో ఆయన పర్యటన షెడ్యూలు ఉండవచ్చని అధికారికవర్గాలు చెప్తున్నాయి. ప్రధాన మంత్రి కార్యాలయం అపాయింట్‌మెంట్ లభిస్తే ఈ నెల 6,7 తేదీల్లో ఢిల్లీ వెళ్లి రాష్ట్రంలోని పలు సమస్యలు, ఇతర అంశాలపై కేసీఆర్ కేంద్ర మంత్రులను కలువనున్నట్లు సమాచారం.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..