mt_logo

స్థానికత కీలకం

తెలంగాణ ఉద్యమమే స్థానికీయ (నేటివిటీ) ఉద్యమం. తెలంగాణ ఉమ్మడి అస్థిత్వ భావనలకు మూలం కూడా ప్రాంతమే. హైదరాబాద్ స్టేట్‌ను ఆంధ్రతో బలవంతంగా కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 1956 నుంచీ స్థానికీయత ఆధారంగానే తొలి ఉద్యమ భావనలు రూపొందాయి. అంతకుముందు సర్వస్వతంత్రంగాఉన్న హైదరాబాద్ సంస్థానంలో కూడా పాలనావసరాల రీత్యా గైర్‌ముల్కీలను ఉద్యోగాల్లో చేర్చుకున్నారు. అప్పుడే ముల్కీల ఆందోళన ప్రారంభమయింది. పరిపాలనలో ఇంగ్లీషు ప్రవేశించినప్పటి నుంచి ఉర్దూ రాజభాషగా విలసిల్లిన హైదరాబాద్ స్టేట్‌లో స్థానికీయత అనేది ఒక సమస్యగానే ఉన్నది. నిజాం కాలం నాటి ఈ పరిణామాల వల్ల అచ్చు హైదరాబాదీలు చేసిన ఆందోళనల ఫలితంగా నిజాం ముల్కీ నిబంధనలు ప్రవేశపెట్టారు. ఈ ముల్కీ నిబంధనలు 1956 తర్వాత క్రమక్రమంగా సడలించారు. 1948లో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌ను విముక్తి చేసిన అనంతరం జరిగిన పరిణామాల వల్ల ముల్కీ నిబంధనలను ఉల్లఘించి స్థానికేతరులను ఉద్యోగాల్లోకి తీసుకోవడం భారీగా జరిగింది.

స్వతంత్ర హైదరాబాద్ స్టేట్‌లో ప్రభుత్వం ఏర్పడేదాకా వెల్లోడి పాలన సాగింది. వెల్లోడి పాలనలో ఆంగ్లావసరాల కోసం ఉద్యోగులను తెచ్చుకోవడంతో స్థానికుల అవకాశాలు దెబ్బతిన్నాయి. తెలంగాణలో ఇంగ్లీషు విద్యావ్యాప్తి లేకపోవడంతో ఇక్కడి వారి అవకాశాలు సన్నగిల్లాయి. సరిగ్గా ఒక ప్రాంతం మీద ఆధిపత్యం కూడా ఇదే కారణాల వల్ల జరిగింది. నిజాం పాలనలో ఉన్న తెలంగాణ, ఆ తర్వాత వెల్లోడి పాలనలో తర్వాత బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్రంగా విలసిల్లింది. ఆంధ్ర ప్రాంతం మద్రాసు నుంచి విడిపోయి ఉన్నది. బ్రిటిషర్ల ఏలుబడిలో ఉన్న ఆంధ్ర ప్రాంతం మిషనరీల వ్యాప్తి, రైలు మార్గం, అప్పటికే వ్యాపించిన ఆధిపత్య ఒక ప్రాంతం, తెలంగాణను నిమ్న ప్రాంతం చేసి విలీనం తర్వాత వలసాధిపత్యంగా స్థిరపడింది. అందువల్లనే వలసాధిపత్యంపై తెలంగాణ జరిపిన ఆరు దశాబ్దాల పోరాటం స్థానికీయ లక్షణం కలది. ప్రపంచ వ్యాప్తంగా అస్థిత్వ ఉద్యమాలన్నింటి తరహాలోనే తెలంగాణ ఉద్యమం ఈ మౌలిక భావనల నుంచి వచ్చిందే.

ప్రాథమికంగా తెలంగాణ పిల్లలకే ఫీజు రీయింబర్స్‌మెంట్ అని ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు సమస్య మూలాల చర్చతో స్థానికతపై తరతరాలుగా జరిగిన అన్యాయానికి చరమగీతం పాడాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని తెలంగాణ సమాజం ఆహ్వానించాలి. ఇప్పటికీ ఇక్కడే తిష్ట వేయాలని భావించే ఆంధ్రులు ఇదేదో తప్పన్నట్టు చిత్రిస్తున్నారు. కొంత కఠినంగా ఉంటుందేమో కానీ పిల్లల చదువుకు కూడా ఇతర ప్రాంతాల సొమ్ము తినాలనుకోవడం ఏరకంగానూ సమంజసం కాదు.

తెలంగాణ పోరాటం సఫలమయింది. కేసీఆర్ నాయకత్వంలో జరిగిన ఈ పోరాటం త్యాగపూరితంగా జరిగింది. ఉద్యోగుల ఉద్యమంగా వచ్చిన 1969 ఉద్యమం మూలకారణం కూడా స్థానికతే. ఆ ఉద్యమం తర్వాత మలి ఉద్యమం త్యాగాల వారసత్వంగా సిద్ధించింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడిక మిగిలింది ఏ మౌలిక లక్షణమైన స్థానిక విద్య, వనరులు, నిధులు, నీళ్లు, కొలువులు స్థానికులకే దక్కాలన్న ఆకాంక్ష కోసమైతే ఉద్యమం వచ్చిందో? ఆ ఆకాంక్ష ప్రభుత్వం తీర్చవలసి ఉన్నది. 1952లో జరిగిన ఉద్యమమే గైర్ ముల్కీ ఉద్యమం. ఈ ఉద్యమంలో కనీసం ఆరుగురు విద్యార్థులు మరణించారు.ఆ ఉద్యమం తర్వాత వలస ఉద్యోగుల పెత్తనం పెరిగి క్రమక్రమంగా స్థానికులు అవకాశాలు కోల్పోవడం, వివక్ష ఈ కారణాల వల్ల 1969 ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమం విఫలమయింది. కానీ టీఎన్జీవోలు 1972లో సుప్రీంకోర్టులో ముల్కీ నిబంధనలు (స్థానికత) కేసును గెలిచారు. తెలంగాణలో అక్రమంగా ఉన్న ప్రాంతేతర ఉద్యోగులను పంపించాలన్న ఆ తీర్పు అమలుకాకుండా ఆంధ్ర పెత్తందారులు, జై ఆంధ్ర ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ ఉద్యమం హింసాత్మకంగా సాగింది.

అప్పటినుంచీ స్థానికుల ఉద్యోగాలకు సంబంధి అష్ట సూత్రాలు, ఆరు సూత్రాలు, 610జీవో, గిర్‌గ్లానీ కమిషన్ లాంటివి ఎన్నైనా స్థానికత సమస్యకు న్యాయం జరగలేదు. ఇప్పటికి ఈ సమస్య ముందు విద్యకు సంబంధించి వచ్చింది. పునర్విజనలో పదేళ్లపాటు ఆంధ్ర, తెలంగాణ మధ్య ఉమ్మడి ప్రాతిపదిక విద్య ఉండడమే ఒక అన్యాయం. కానీ అది కొనసాగినప్పుడు వచ్చే సమస్యలు ఒకటి అప్పటికే అమలులో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ రూపంలో ముందుకు వచ్చింది. తెలంగాణలో ఆంధ్ర ప్రాంతపు (స్థానికత) మూలాలు గల 39 వేలమంది విద్యార్థులు చదువుకుంటే ఆంధ్ర ప్రాంతంలో తెలంగాణ పిల్లలు తక్కువ సంఖ్యలో చదువుతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో స్థానికత పాటించకపోతే తెలంగాణ రాష్ట్రం అప్పనంగా కోట్ల రూపాయలు ఇచ్చి అక్కడి పిల్లలకు చదువులు చెప్పించాల్సిన దుస్థితి. అందువల్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఉద్యమకారుడు కనుక ప్రతి సమస్యపై పూర్తిస్థాయి అవగాహన కలిగిన సమర్థుడు కనుక స్థానిక అంశం లోతుపాతులను తెలుసుకొని, 1956కు ముందు ఇక్కడ పుట్టిన వారికే ఫీజులు చెల్లిస్తామని కుండబద్దలుకొట్టారు. ప్రాథమికంగా తెలంగాణ పిల్లలకే ఫీజు రీయింబర్స్‌మెంట్ అని ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు సమస్య మూలాల చర్చతో స్థానికతపై తరతరాలుగా జరిగిన అన్యాయానికి చరమగీతం పాడాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని తెలంగాణ సమాజం ఆహ్వానించాలి. ఇప్పటికీ ఇక్కడే తిష్ట వేయాలని భావించే ఆంధ్రులు ఇదేదో తప్పన్నట్టు చిత్రిస్తున్నారు. కొంత కఠినంగా ఉంటుందేమో కానీ పిల్లల చదువుకు కూడా ఇతర ప్రాంతాల సొమ్ము తినాలనుకోవడం ఏరకంగానూ సమంజసం కాదు.

[నమస్తే తెలంగాణ సౌజన్యంతో]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *