mt_logo

వాతావరణ మార్పులు-అడవులపై ప్రభావంపై జాతీయ స్థాయి సెమినార్

– వాతావరణ మార్పులు-అడవులపై ప్రభావం అనే అంశంపై అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీలో జాతీయ స్థాయి సెమినార్

– పాల్గొన్న వివిధ రాష్ట్రాలకు చెందిన అటవీ సంరక్షణ ప్రధాన అధికారులు (PCCF’s)

– ఫీల్డ్ విజిట్ లో భాగంగా తెలంగాణ అడవులు, అర్బన్ ఫారెస్ట్ పార్క్ లు, అడవుల్లో అభివృద్ది పనులను పర్యవేక్షించిన అటవీ ఉన్నతాధికారులు.

వాతావరణ మార్పులు, అడవుల సంరక్షణలో ఎదురౌతున్న సవాళ్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హైదరాబాద్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీలో జాతీయ స్థాయి సెమినార్ జరుగుతోంది. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 14 నుంచి 18 వరకు ఈ కార్యక్రమాన్ని ఆస్కీ నిర్వహిస్తోంది. ఇరవై రాష్ట్రాలకు చెందిన అటవీ శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు.

క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా ఈ అధికారులందరూ మేడ్చల్ జిల్లా కండ్లకోయలో ఉన్న ఆక్సీజన్ అర్బన్ ఫారెస్ట్ తో పాటు, సిద్దిపేట జిల్లా గజ్వేల్ అటవీ ప్రాంతాల్లో పర్యటించారు. తెలంగాణ ప్రభుత్వం అటవీ శాఖతో పాటు, పచ్చదనం పెంపు, అటవీ రక్షణ, పునరుజ్జీవన చర్యలకు ఇస్తున్న ప్రాధాన్యతను పీసీసీఎఫ్ ఆర్. శోభ ఇతర రాష్ట్రాల అధికారులకు వివరించారు. తెలంగాణకు హరితహారం విశిష్టత, అమలవుతున్న తీరును వారికి వివరించారు.

హైదరాబాద్ చుట్టూ అటవీ ప్రాంతాల్లో అభివృద్ది చేస్తున్న అర్బన్ పార్కులపై ఇతర రాష్ట్రాల అటవీ ఉన్నతాధికారులు ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. రానున్న రోజుల్లో ఈ పార్కులన్నీ ప్రజలకు మంచి పర్యావరణ ఆస్తులుగా మిగులుతాయని ప్రశంసించారు. గజ్వేల్ శరీఫ్ రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్ పరిధిలో సింగాయపల్లిలో క్షీణించిన అటవీ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో పునరుజ్జీవనం చేసిన విధానాన్ని తెలంగాణ అటవీ శాఖ అధికారులు అన్ని రాష్ట్రాల అధికారులకు చూపించారు. గజ్వేల్, కోమటిబండ ప్రాంతాల్లో ప్రధాన రోడ్లు, గ్రామీణ రోడ్లలో ప్రత్యేకంగా అభివృద్ది చేసిన రహదారి వనాలను (అవెన్యూ ప్లాంటేషన్) పరిశీలించారు. తగిన రక్షణ చర్యలు తీసుకోవటం వల్ల, తక్కువ కాలంలో ఏపుగా పెరిగిన మొక్కలు, రహదారులకు ఇరువైపులా పచ్చదనాన్ని పరుస్తున్నాయని మెచ్చుకున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాలుగా రాష్ట్రమంతటా హరితహారం, అటవీ పునరుద్ధరణ పనులను అన్ని నియోజకవర్గాల్లో చేపడుతున్నట్లు పీసీసీఎఫ్ శోభ వెల్లడించారు.  సింగాయపల్లి ప్రాంతంలో అటవీ రక్షణ కోసం తవ్విన కందకాలు, గట్లపై సహజసిద్ధమైన కంచెగా  పెంచుతున్న గచ్చకాయ చెట్లను పరిశీలించారు. ఈ నమూనాను తమ రాష్ట్రంల్లో కూడా అమలు చేస్తామని కొందరు పీసీసీఎఫ్ లు వెల్లడించారు.

గజ్వేల్ సమీపంలో అభివృద్ధి చేసిన సంగాపూర్ ఫారెస్ట్ పార్క్ ను కూడా అధికారులు సందర్శించారు. కొత్త రాష్ట్రమైనా తెలంగాణ ప్రభుత్వం అటవీ రక్షణ, పచ్చదనం పెంపు కోసం తీసుకుంటున్న చర్యలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని పలువురు అధికారులు ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరాంచల్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, జార్ఖండ్, కేరళతో పాటు పలు కేంద్ర పాలిత ప్రాంతాల అటవీ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, హైదరాబాద్ చీఫ్ కన్జర్వేటర్ చంద్రశేఖర్ రెడ్డి, ఆస్కి ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ వల్లి మాణికం, మేడ్చల్, సిద్దిపేట జిల్లాల అటవీ అధికారులు సుధాకర్ రెడ్డి, శ్రీధర్ లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *