mt_logo

తెలంగాణకు నంది అవార్డుల వెనుక

By: విశ్వరూప్ 

ఈ సంవత్సరం తెలంగాణ సినిమాలు “జైబోలో తెలంగాణ”, “ఇంకెన్నాళ్ళు ” కు నంది అవార్డులు రావడం తెలంగాణ ప్రజలకు కూడా ఆశ్చర్యం కలిగించే విషయం. తెలంగాణ కళాకారులను అణగదొక్కి, తెలంగాణ సంస్కృతిపై విషం చిమ్మే తెలుగు ఫిల్మ్ ఇందస్ట్రీ, తెలంగాణ ఉద్యమాన్ని అడుగడుగునా అణగదొక్కుతూ జైబోలో తెలంగాణ సినిమా సెన్సారుకు కూడా ఎన్నో అవరోధాలు కలిపించిన ప్రభుత్వం కలిసి తెలంగాణ సినిమాకు అవార్డులు ఇవ్వడం ఆశ్చర్యం కలిగించే విషయమే మరి.

నిజానికి ఈ సినిమాలకు అవార్డులు రావడానికి అన్ని అర్హతలూ ఉన్నాయి. జైబోలో తెలంగాణకు సౌథ్ ఏషియా ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడే అరుదైన అవకాశం కూడా లభించింది. నిజానికి ఈ సినిమాకు ఉత్తమ సినిమా అవార్డు రావాలి. రాష్ట్రాలు బలంగా ఉంటేనే జాతీయ సమగ్రత, రాష్త్రంలో అందరు ప్రజలకు సమాన అవకాశాలు లభించబడ్డప్పుడే రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయి, ఒక ప్రాంత ప్రజల అవకాశాలను వారికి కాకుండా చేస్తే రాష్ట్రం సుభిక్షంగా ఉండదు, దేశానికీ నష్టం. రాష్ట్రం కేవలం తెలుగు మాట్లాడేవారిది కాదు, ఇక్కడ నివసించే అందరిదీ. ఈ ఉద్యమం మరో ప్రాంత ప్రజలకు వ్యతిరేకం కాదు, దోపిడీ చేసే వర్గానికి మాత్రమే వ్యతిరేకం అనే సందేశాన్ని చక్కగా చూపించిన జైబోలో తెలంగాణ జాతీయ సమగ్రతా అవార్డుకు అన్నివిధాలుగా అర్హమయినది.

అయితే ఈ సినిమాకు అవార్డు రావడం ఆశ్చర్యం కలిగించడానికి కారణం గత అనుభవాలు. ఎప్పుడూ మోసం చేసేవాడు ఒక్కసారిగా మంచి పని చేస్తే ఆశ్చర్యం సహజంగా కలుగుతుంది. గతంలో ఇంతకన్నా చక్కని సినిమాలు కూడా నంది అవార్డుల విషయంలో తిరస్కారానికి గురయ్యాయి. ఉదాహరణకు మాభూమి, అంకురం, దాసి, భద్రం కొడుకో వంటి సినిమాలకు నేషనల్ అవార్డులు లభించినా నంది అవార్డులు మాత్రం దక్కలేదు.

నంది అవార్డులను నిర్ణయించడానికి ఒక కమిటీ ఉంటుంది. ఈ కమిటీని ప్రభుత్వం నియమించినా ఫిల్మ్ ఇండస్ట్రీ సిఫార్సు చేసినవారినే గతంలో ప్రభుత్వం ఈ కమిటీ సభ్యులుగా నియమించేది. సహజంగానే ఈ సభ్యులందరూ ఇండస్ట్రీకి గుత్తాధిపత్యం వహిస్తున్న వర్గం (నాలుగు కుటుంబాలు, రెండు కులాలు, ఒక ప్రాంతం) వారికి కావల్సిన వారు అయుంటారు కనుక అన్ని అవార్డులూ వారికే వచ్చేవి. ఈమధ్యన ఈ నలుగురి పెత్తనంవల్ల తెలుగులో కాస్త మంచి ఇండిపెండెంట్ సినిమాలు తీసే దర్శకులే కరువయ్యారు (క్రిష్, చంద్ర సిద్ధార్థ్ లాంటి ఒకరిద్దరు తప్ప) కనుక ఈ అవార్డుల నిర్ణయాలు మరీ శృతిమించాయి. బాలక్రిష్ణకూ, దాసరికీ ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వడం కాపీ సినిమాలు తీసే రాజమౌళి నాలుగు సినిమాలు కలిపి కుట్టిన మగధీరకు ఉత్తమచిత్రం అవార్డు రావడం దీనికి పరాకాష్ఠ.

ప్రతి సంవత్సరం అవార్డుల విషయంలో వస్తున్న విమర్శల కారణంగా గతసంవత్సరం అవార్డుల కమిటీ నియామకంలో ప్రభుత్వం కొన్ని ప్రమాణాలు పాటించింది. కమిటీలో సభ్యులను ఫిల్మ్ ఇండస్ట్రీ సిఫార్సులమేరకు కాక విభిన్న రంగాలలో ప్రముఖులనూ, మేధావులనూ సభ్యులుగా నియమించారు. అంపశయ్య నవీన్ (రచయిత), కే. బాసిరెడ్డి (దర్శకుడు, టెక్నోక్రాట్), అల్లాణి శ్రీధర్ (జర్నలిస్ట్), ప్రొఫెసర్ ఆనందన్, గోపిని కరుణాకర్ (రచయిత) అవార్డుల కమిటీలో కొన్ని పేర్లు. అందుకే ఈ సంవత్సరం అవార్డుల ఎంపికలో ఎలాంటి వివాదాలు లేవు. అర్హత ఉన్న సినిమాలకు అవార్డులు లభించాయి. జైబోలో తెలంగాణకు అవార్డు రావడం తెలంగాణ వ్యతిరేకులకు కంటగింపు కలిగించినా అవార్డులను మేధావులు హర్షించారు. గత సంవత్సరం బాలక్రిష్ణ అవార్డు తప్ప మిగతా అవార్డులు బాగానే ఉన్నాయి.

అయితే నాలుగు అవార్డులు వచ్చాయి కదా అని సంతోషిస్తే ఇల్లలికి పండగ చేసుకున్నట్లే. చిత్రపరిశ్రమనూ, తెలంగాణలో థియేటర్లనూ ఈ రెండుకులాలు, నలుగురు వ్యక్తుల కబంధహస్తాలనుండి తప్పించి తెలంగాణ కళాకారులకు సరైన అవకాశాలు కల్పించినపుడే చిత్రపరిశ్రమకు నిజమైన విజయం. ఇది తెలంగాణ ఏర్పాటువలన మాత్రమే సాధ్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *