ఒక కథ చెప్పబుద్ధవుతున్నది. అనగనగా ఒక రాజు. ఆయన ఒక విపత్కర నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందట. ఒక ఇద్దరికి మరణ శిక్ష విధించాల్సి వచ్చింది. వాళ్లు తప్పు చేసిండ్రా, ఒప్పు చేసిండ్రా అన్నది పక్కన బెట్టుండ్రి. న్యాయమో ధర్మమో ఒక సంగతి జరిగింది. ఆ ఇద్దర్ని శిక్షించాలె! అది గూడా మరణ దండన విధించాలె! కానీ, ఆయనకు మనసొప్పడం లేదు. లాస్టుకు ఒక అవకాశం ఇచ్చి చూద్దామనుకున్నడు. ఆ పరీక్షలో నెగ్గితే బతికే అవకాశం ఉన్నది మరి! అయినగని ఆ పరీక్ష ప్రాణ సంకటమే. రెండు కొండల నడుమ ఒక తాడు కడ్తరట! ఆ తాడు మీదికెళ్లి వాళ్లు నడవాల్నట! ఇంకో సంగతి తెల్సా? ఆ రెండు కొండల నడుమ ఓ పెద్ద లోయ గూడ ఉన్నది. దానర్థం… వాళ్లకు చావు ఖాయమన్నట్టే! కలలో కూడా ఊహించని ఈ పరీక్ష కోసం వాళ్లిద్దరూ జీవితంలో మొట్టమొదటిసారి టైట్ రోప్ వాకర్స్ ఐండ్రు.ఆ రాత్రి ఇద్దరిలో ఒకాయనకు నిద్ర వట్టలేదు. దేవుడికి మొక్కుతనే ఉన్నడు. కనీసం పచ్చి మంచినీళ్లయినా ముట్టలేదు! ఇంకొకాయన మాత్రం నిరందిగ ఉన్నడు.
తాడు మీద నడక గురించి ఆయన ఎన్నడూ విన్నది లేదు, కన్నదీ లేదు. ఇగ దాని గురించి ఆలోచించి ఏం పాయిద అనుకున్నడు. రేపెలాగూ చావు ఖాయం అనుకున్నప్పుడు ఆ రాత్రైనా కంటి నిండా నిద్ర పోదామని మంచిగ నిద్రపోయిండు. పొద్దున్నే ఎప్పట్లా ఛాయ్ తాగి, ఆ పరీక్ష జరిగే దగ్గరికి నిదానంగా నడుచుకుంట వచ్చిండు. ఇవతలాయన మాత్రం పరేషాన్‌ల గజగజ వణుకుతుంటె ఈన మాత్రం నవ్వు మొహంతోనే వచ్చి ఆ తాడు మీద నడవడం మొదలు వెట్టిండు. నడిచేసిండు. కనికట్టా అన్నట్టు ఆయన సునాయాసంగా నడిచేసిండు.ఎవ్వలూ నమ్మలేక పోయిండ్రు. ఆడికి సర్కస్ కంపెనీల్లో తాడు మీద నడిచేటోళ్లు గూడ వచ్చిండ్రు. వాళ్లు కూడా ముక్కుమీద వేలు వేసుకున్నరు. చిన్న దూరం గూడా కాదు. కొంచెం సొలిగినా ఖతమే. అయినా ఆ మనిషి భయం గియం లేకుండా…అట్ల… మార్నింగ్ వాక్‌కు పోయినట్టు… ఆ తాడుమీద శాంతంగా నడిచిండు.రెండో ఆయన ఆశ్చర్య చకితుడైండు. ‘ఇగో… నువ్వెట్ల నడిచినవో చెప్పవయ్యా’ అని గట్టిగా అవతలి కొండకు చేరిన మొదటి మనిషిని అడిగిండు. అట్నుంచి, ‘‘ అయ్యో…నాకేం తెల్సు…’’ అని సమాధానం. ‘‘చెప్పవయ్యా చెప్పు.
ప్రాణాలు పోతయి’’ దండం పెట్టి అడిగిండు ఈయన. ఆ మాటకు గిట్ల సమాధానం ఇచ్చిండు ఆ నడిచిన మనిషి: ‘‘అయ్యా… నేనెట్ల నడిచిన్నో చెప్పలేనుగని ఒకటి మాత్రం చెబుత! నా బతుకంతా గిట్లనే నడిచింది’’ అన్నడాయన. ‘‘అవునయ్యా…నిజంగ చెప్పాలంటే తాడు మీద నడవడం నాకు తెల్వనే తెల్వదు. కానీ నా బతుకంతా గిట్లనే నడిచింది… ఎటో ఒక దిక్కు నేనెన్నడూ ఒరిగిందీ లేదు. కొంచెం కుడికి ఒరిగితే మళ్లీ ఎడమ దిక్కు బ్యాలెన్స్ చేసుకున్న. కొంచెం ఎడమకు పోతే మల్ల కుడిదిక్కు జరిగి బ్యాలెన్స్ చేసుకున్న. పాసంగం తప్పకుండ ఉండాలనే నా బతుకంతా కష్టవడ్డ.
నిలబడ్డా…నడిచినా…అటూ ఇటూ సోలకుండ…ఇగో చూసిండ్రు గదా… మీ ముందట నడిచినట్టే బతుకంతా నడిచిన…అందుకే అంటున్న…ఎట్ల వచ్చిన్నో… ఈడిదాకా వచ్చిన. కానీ ఎట్ల నడిచిన్నో చెప్పమంటె చెప్పజాలను…జెప్పినా సుత నీకర్థం కాదు. అది అనుభవం మీద తెల్వవల్సిందే….’’ వివరించిండాయన.అదీ కథ. తెలంగాణల ఇయ్యాల జనం గోస గింతకంటే వేరే తీర్గ లేదు. మనందరం ఈడిదాక ఎట్ల వచ్చినమో వచ్చినం. పాసంగం తప్పకుండనే బతుకుతున్నం. అది ధర్మమా కాదా అన్న సంగతి మన మనసుకు తెల్సు. ఇగ ఇంకొంచెం దూరం నడవాల్నట. నడుద్దాం. అదెంత సుతారం!మనది మనకు అయ్యేదాకా నడుస్తనే ఉంటం. జై తెలంగాణ!
– నమస్తే తెలంగాణ నుండి