ఫొటో: నమస్తే తెలంగాణ ప్రధమ వార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేస్తున్న ఎండీ సి.ఎల్. రాజం దంపతులు, చిత్రంలో పత్రిక సి.ఇ.ఓ కట్టా శేఖర్ రెడ్డి, ఎడిటర్ అల్లం నారాయణ ఉన్నారు.
***
పత్రికా ప్రచురణ తెలంగాణకు కొత్త కాదు. దాదాపు 125 యేండ్ల క్రితమే ఈ ప్రాంతంలో తెలుగు పత్రికలు ప్రచురింపబడ్డాయి. 1886 ద్వితీయార్ధంలో ప్రారంభమైన “శేద్యచంద్రిక” తెలంగాణలో ప్రచురించిన తొలి తెలుగు పత్రికగా పేరుగాంచింది.
అటుపై ‘సుజాత’, ‘నీలగిరి’ నుండి గోల్కొండ పత్రిక వరకూ అనేక తెలంగాణ పత్రికలు వచ్చాయి. కానీ తెలంగాణ, ఆంధ్ర విలీనం కాగానే ఇక్కడి పత్రికలు అంతర్ధానమై సీమాంధ్ర మీడియా ఆధిపత్యం మొదలయ్యింది. కారణాలు అంతుబట్టనివి ఏమీ కావు.
అటుపై తమకంటూ ఒక స్వంత దినపత్రిక కొరకు అయిదు దశాబ్దాలు నిరీక్షించాల్సి వచ్చింది తెలంగాణ ప్రజలు. సుధీర్ఘ నిరీక్షణ తరువాత గత యేడాది ప్రారంభమైన నమస్తే తెలంగాణ, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలబడింది. నిన్ననే తొలి వార్షికోత్సవం జరుపుకున్నది.
రియల్ ఎస్టేట్, సినిమా వంటి అక్రమ వ్యాపారాలకు, రాజకీయానికి పుట్టిన సీమాంధ్ర విషపుత్రికలే స్వైరవిహారం చేస్తున్న తెలంగాణ గడ్డమీద నమస్తే తెలంగాణ ఆవిర్భావం నిజంగా చారిత్రాత్మకం.
–
–
ఈ పత్రిక ఆవిష్కరణ కూడా చాలా వైవిధ్యంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాల చేతుల మీదుగా జరిగింది.
తొలిరోజు నుండే పత్రిక ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాలను పూసగుచ్చింది. తొలివారంలోనే శ్రీకృష్ణ కమిటీ రహస్య నివేదికను బట్టబయలు చేసి తెలంగాణకు స్వంత పత్రిక ఉండటం ఎంత అవసరమో ప్రత్యక్షంగా నిరూపించింది.
అది మొదలు, ఏడాది కాలంలో నమస్తే తెలంగాణ ప్రచురించిన పరిశోధనాత్మక కథనాలు సీమాంధ్ర భూ బకాసురుల, అక్రమార్కులకు కంటిమీద కునుకు లేకుండా చేశాయి.
ఘనమైన చరిత్ర, వాసత్వ సంపద, సంస్కృతీ సాంప్రదాయాలు ఉండి కూడా ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో చిమ్మచీకటిలో ఉన్న తెలంగాణకు నమస్తే తెలంగాణ రాకతో ఒక కొత్త వేకువ వచ్చినట్టయ్యింది. సీమాంధ్ర మీడియా వివక్షకు లోనైన అనేక అబ్బురపరిచే, అరుదైన చారిత్రక అంశాలను వెలుగులోకి తెచ్చింది ఈ పత్రిక. ఈతరానికి తెలియని ఎందరో గొప్ప నాయకుల, సృజనకారుల స్ఫూర్తిదాయక జీవితాలను తన పేజీల్లో పరచింది నమస్తే తెలంగాణ.
తెలంగాణ ఉద్యమంతో మమేకమైన అల్లం నారాయణ, కట్టా శేఖర్ రెడ్డి, కందుకూరి రమేశ్ బాబు వంటి హేమాహేమీలు ఒక ఉద్యమస్ఫూర్తితో నడుపుతున్న ఈ పత్రిక ప్రారంభం నుండే సీమాంధ్ర పత్రికలను తలదన్నేలా తయారయ్యింది. అన్ని వర్గాలనూ ఆకట్టుకునేలా ఉన్న ప్రత్యేక అనుబంధాలు, తెలంగాణ గర్వపడే మేధావుల వ్యాసాలతో పాటు ప్రతి ఆదివారం తెలంగాణ సంస్కృతీ సౌరభాలను వెదజల్లే బతుకమ్మ ఈ పత్రికకే హైలైట్.
తెలంగాణ ఉద్యమాన్ని సరిగా కవర్ చేయకుండా, లేదా నెగెటివ్ గా కవర్ చేస్తూ వచ్చిన సీమాంధ్ర మీడియాకు ఇప్పుడు నమస్తే తెలంగాణ రావడంతో ఊపిరి సలపడం లేదు. బహుశా అందుకే సీమాంధ్ర రాజకీయ నాయకులకు, వారి కనుసన్నల్లో నడిచే మీడియాకు ఈ పత్రిక కంటగింపు కూడా అయ్యింది. దాని పర్యవసానమే నమస్తే తెలంగాణ గొంతు నులమడానికి వివిధ స్థాయిల్లో జరుగుతున్న కుట్రలు. హాకర్లను, పేపర్ బాయ్స్ ను ప్రలోభపెట్టడం మొదలు, నమస్తే తెలంగాణ యాజమాన్యాన్ని రాజకీయ వివాదాల్లోకి లాగడం వరకూ అనేక కుట్రలు రచించారు.
అడ్డంకులెన్ని సృష్టించినా ప్రజాభిమానమే అండగా తెలంగాణ ఉద్యమానికి నిత్యం స్ఫూర్తినిస్తూ ముందుకు సాగుతోంది నమస్తే తెలంగాణ.
ఈ పత్రికను నాలుగు కాలాల పాటు వర్ధిల్లేలా చేయడం మనందరి బాధ్యత.