mt_logo

తగునా బీజేపీ, ఇటువంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలు?

“పార్లమెంటులో మా మద్ధతు లేకుండా తెలంగాణ ఎలా సాధ్యపడుతుంది?” అనేది బీజేపీ డిల్లీ నాయకుల నుండి గల్లీ అభిమానుల వరకూ చాలా ఫేవరెట్ ప్రశ్న.

పరకాల ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న కొద్దీ ఈ అంశం ప్రతిరోజూ తెరమీదికి తెస్తోంది కాషాయ దళం.

కాంగ్రెస్ ఎలాగూ తెలంగాణను మోసం చేసిందని, 2014లో ఎన్.డీ.యేనే అధికారంలోకి వస్తుంది కనుక తమ మద్ధతు లేకుండా పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఎలా ఆమోదం పొందుతుందనేది కమలనాధుల ప్రశ్న.

ఈ ప్రశ్న అడగడంలో బీజేపీ ఒక ప్రాధమిక రాజకీయ సూత్రాన్ని విస్మరిస్తోందనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జాతీయ స్థాయిలో ఏ రాష్ట్ర ఏర్పాటుకు లేనంత మద్ధతు ఉంది. శరద్ పవార్, ఎ.బి. బర్ధన్, మమతా బెనర్జీ అజిత్ సింగ్, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి జాతీయ స్థాయి హేమాహేమీలు మద్ధతు ఇస్తున్నారు.

ఈ డిమాండుకు సపోర్ట్ పలకడం వల్ల ఆయా నేతలకు నేరుగా వచ్చే లబ్ది ఏమీలేదు. తెలంగాణ ఒక న్యాయమైన డిమాండ్ అని వారు గుర్తించడం వల్లనే వారు ఈ అంశానికి మద్ధతుగా నిలిచారు.

ఆరు దశాబ్దాల మహత్తర చరిత్ర గల ప్రజా ఉద్యమాన్ని గౌరవించడం ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ కనీసం ధర్మం. కనుకనే అనేక పార్టీలు తెలంగాణను పార్లమెంటులో కూడా సమర్ధిస్తున్నాయి.

“మా మద్ధతు లేకుండా తెలంగాణ ఎలా వస్తుంది?” అని మాటిమాటికీ హుంకరించడం బ్లాక్ మెయిల్ రాజకీయం అవుతుంది. అది బీజేపీ వంటి జాతీయ పార్టీకి ఏ విధంగానూ శోభనివ్వదు. తెలంగాణకు మద్ధతు ఇవ్వవలసింది కే.సీ.ఆర్ కొరకో టీ.ఆర్.ఎస్ కొరకో కాదు. అది మూడున్నర కోట్ల తెలంగాణ భూమిపుత్రుల కొరకు.

ఉద్యమ క్రమంలో ఒక రాజకీయ పార్టీ బలపడాలనుకోవడం తప్పుకాదు. కానీ అలా బలపడటం ఉద్యమానికి మేలుచేసే విధంగా ఉండాలి. అంతేకానీ ఒక్క సీటుకొరకు ఉద్యమ ప్రయోజనాలను ఫణంగా పెట్టడం ఏ విధంగానూ సమర్ధనీయం కాదు. భాజపా పాలమూరులో చేసింది అదే. అందుకే అప్పటివరకూ అంతో ఇంతో భాజపా అంటే సానుకూలంగా ఉన్న తెలంగాణవాదులు కూడా ఇప్పుడు ఆ పార్టీని దూరం పెడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *