mt_logo

నల్లగొండ జిల్లాలో రూ. 570 కోట్లతో పనులకు భూమిపూజ..

ఆదివారం నల్లగొండ జిల్లా చందంపేట మండలం నేరడుగొమ్ములో 570 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఓపెన్ కెనాల్, పెండ్లిపాకల ప్రాజెక్టు సామర్ధ్యం పెంపు పనులకు భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు, హోం మంత్రి నాయిని, విద్యాశాఖామంత్రి జగదీష్ రెడ్డి కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ, ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం నక్కలగండి ఎత్తిపోతలతోనే సాధ్యమవుతుందని, ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ పథకాన్ని చేపడుతుందని చెప్పారు.

రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులకు భారీగా నికర జలాల కేటాయింపులు జరగాల్సిన అవసరం ఉందని, నీటి కేటాయింపుల కోసం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని తెలిపారు. సీఎం కేసీఆర్ కు నల్లగొండ జిల్లా సమస్యలపై పూర్తిస్థాయి అవగాహన ఉందని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వాటర్ గ్రిడ్ పనులకు ఈ జిల్లానుండే శ్రీకారం చుడుతున్నారన్నారు. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా నల్గొండ జిల్లాలో 5 వేల చెరువులను పునరుద్ధరిస్తున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణలో ఎత్తిపోతల పథకాలను అడ్డుకోవడానికి ఏపీ సీఎం చంద్రబాబు అడ్డుపడుతున్నారని, కేంద్రానికి లేఖలు రాస్తూ కుట్రలు చేస్తున్నాడని, ఎవరెన్ని కుట్రలు చేసినా ఈ ఎత్తిపోతల పథకాలను చేపట్టి తీరుతామని స్పష్టం చేశారు.

అనంతరం మంత్రులు నాయిని, జగదీష్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తలపెట్టిన బంగారు తెలంగాణ నిర్మాణంలో అన్ని పార్టీల నేతలు రాజకీయాలకతీతంగా సహకరించాలని, 14 ఏళ్లలో చేసిన ఉద్యమం కంటే రెట్టింపు కృషితో తెలంగాణ అభివృద్ధికి పాటుపడాలని సీఎం చెప్పారని పేర్కొన్నారు. ఆంధ్రా పాలకుల నిర్లక్ష్యంతోనే 40 ఏళ్లుగా ఎస్సెల్బీసీ ప్రాజెక్టు పూర్తికాలేదని, వచ్చే ఐదేళ్ళలో ప్రతి ఎకరాకు నీరందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *