నల్లగొండ జిల్లా బీబీనగర్ సమీపంలోని రంగాపూర్ వద్ద అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఎయిమ్స్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంగళవారం బీబీనగర్ నిమ్స్ ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సందర్శించి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న బీబీనగర్ నిమ్స్ స్థానంలో సుమారు రూ. వెయ్యి కోట్లతో ఎయిమ్స్ ను, అంతర్జాతీయ స్మార్ట్ హెల్త్ సిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
ఎయిమ్స్ నిర్మించడానికి మొత్తం 200 ఎకరాల స్థలం కావాల్సి ఉండగా ప్రస్తుతం బీబీనగర్ లో 160 ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. మిగతా 40 ఎకరాల స్థలాన్ని వెంటనే సేకరించాలని సీఎం అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారి పక్కనే ఉండటమే కాకుండా రింగ్ రోడ్ కూడా దగ్గరగా ఉండటం, హైదరాబాద్ కు 20నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో బీబీనగర్ లోనే ఎయిమ్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో ఏపీ, తెలంగాణలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏర్పాటు చేయడానికి కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఇందుకోసం అవసరమైన 200 ఎకరాల స్థలం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రతిపాదనలు పంపమని కోరడం కూడా జరిగింది. ఎయిమ్స్ స్థల పరిశీలనకోసం కేంద్ర బృందం త్వరలో రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ బీబీనగర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎయిమ్స్ సమీపంలోనే అంతర్జాతీయ స్థాయిలో స్మార్ట్ హెల్త్ సిటీని నిర్మించాలని కూడా సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి టీ రాజయ్య, భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు పైళ్ళ శేఖర్ రెడ్డి, గొంగిడి సునీత, గాదరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.