mt_logo

వినాయక నిమజ్జనంలా నిర్వహిస్తాం – హరీష్ రావు

మిషన్ కాకతీయను ఒక ప్రజా ఉద్యమంలా మలుస్తామని, ఊరి పండుగలా పూడిక తీసే కార్యక్రమం ఉంటుందని, ఇంకా చెప్పాలంటే గణేష్ నిమజ్జనంలా గ్రామంలోని చిన్నాపెద్దా అంతా పాల్గొనేలా చూస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. మంగళవారం ఒక హోటల్ లో వివిధ పత్రికలు, టీవీ చానళ్ళ సీఈవోలు, బ్యూరో చీఫ్ లు, సంపాదకులు, ప్రముఖ పాత్రికేయులతో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి హరీష్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణను సస్యశ్యామలం చేసేది మిషన్ కాకతీయ అని, దీనివల్ల 265 టీఎంసీల నీటిని నిల్వ చేయడమే కాకుండా 46,531 చెరువులను పునరుద్ధరించడం ద్వారా చాలా లాభాలు ఉంటాయన్నారు.

మిషన్ కాకతీయలో ప్రజలందరి భాగస్వామ్యం ఉంటుందని, బతుకమ్మలు, డప్పులతో ప్రజలంతా ఇందులో పాల్గొనేలా చేస్తామని హరీష్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరిగేలా, ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా చూడటంలో మీడియా పాత్ర ఎంతైనా ఉందని, దీనిపై సలహాలు, సూచనలు ఇవ్వాలని మంత్రి కోరారు. మిషన్ కాకతీయపై మీడియా ప్రత్యేక కథనాలు ప్రచురించాలని, చెరువుల నుండి పూడికతీత ద్వారా వచ్చే మట్టిని పెద్దఎత్తున రైతులు తీసుకెళ్లేలా స్ఫూర్తిని కలిగించే కథనాలు ఇవ్వాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు.

వరంగల్ జిల్లాలో మిషన్ కాకతీయ పైలాన్ ను ఈ నెలాఖరులో గానీ, వచ్చేనెల మొదటివారంలో గానీ కేంద్రమంత్రి చేతులమీదుగా ఆవిష్కరింపజేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంపై అధ్యయనం చేయడానికి మిచిగాన్ యూనివర్సిటీ సుమారు లక్ష డాలర్లను కేటాయించి నలుగురు రీసెర్చ్ స్కాలర్లను పంపించిందన్నారు. ప్రపంచ బ్యాంకు, నాబార్డు, కేంద్రం, జపాన్ ల నుండి వచ్చే నిధులతో ఐదేళ్ళలో సుమారు 22 వేల కోట్లతో 46 వేలకుపైగా చెరువులను పునరుద్ధరించనున్నట్లు హరీష్ వివరించారు. ఈ సమావేశంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్ రెడ్డి, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కే శ్రీనివాస్, కవి జూలూరి గౌరీశంకర్, తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు మల్లేపల్లి లక్ష్మయ్య, నీటిపారుదల శాఖ సలహాదారు విద్యాసాగర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *