ప్రపంచ పీఠభూముల మీద ఆత్మగౌరవ జెండా ఎగరేసిన ఓ గుండె తడి ఉన్నోడు తీసిన సినిమాలు ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల కోసం ఆన్‌లైన్‌లో ఉన్నాయి. వాషింగ్టన్ డీసీలో నక్షత్రం ప్రొడక్షన్స్ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ముఖ్య అతిథిగా పాల్గొని నక్షత్రం ప్రొడక్షన్స్ ఆన్‌లైన్ ఛానల్ ని ప్రారంభించారు.
నక్షత్రం ప్రొడక్షన్స్ సమర్పణలో వేణు నక్షత్రం స్వీయ దర్శకత్వంలో నిర్మించిన అవతలి వైపు, పిలుపు, ఎంతెంత దూరం ఇప్పటికే ఇటు ఇండియాలో, అటు అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు, రివార్డులు అందుకొన్న విషయం సోషల్ నెట్‌వర్క్ ద్వారా ఇప్పటికే చాలా మందికి తెలిసిందే.
హైదరాబాద్‌లో జరిగిన ఏకశిలా అవార్డులు, తెలంగాణ ఫిలిం ఫెస్టివల్ లో ద్వితీయ ఉత్తమ చిత్రం , ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన ప్రదర్శనలో సినీ వైతాళికుడు మాభూమి, దాసి చిత్రాల ద్వారా అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన బీ. నర్సింగరావు చేత ప్రశంసలు, తెలంగాణ సాంస్కృతిక సారధి రసమయి బాలకిషన్ చేత ప్రశంసలు అందుకున్నాయి ఈ చిత్రాలు. ఏకశిలా అవార్డులలో పరుచూరి వెంకటేశ్వర్ రావు గారు ఎంతెంత దూరం చిత్రాన్ని చూసి తన చిన్న తనాన్ని గుర్తు చేసిన చిత్రమని ప్రశంసించారు. భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారు ఈ చిత్రాలని చూసి వేణు నక్షత్రంలో ఒక గొప్ప సృజనాత్మక దాగి వుంది అని, ఈ చిత్రాలని అంతర్జాతీయ స్థాయిలో పేరు గాంచిన ఇరాకీ సినిమాలతో పోల్చుతూ, భవిష్యత్తులో మన దేశానికి పేరు తెచ్చే సినిమాలు తీసే సత్తా వున్న దర్శకుడు వేణు నక్షత్రం అని ప్రశంసిస్తూ, ఫిల్మోత్సవ్ సందర్భంగా వేణు నక్షత్రం సినిమాలని ప్రదర్శించడం రవీంద్రభారతి చరిత్రలో ఒక కొత్త అధ్యాయం అని అన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో వరల్డ్ మ్యూజిక్ అండ్ ఇండిపెండెంట్ ఫెస్టివల్ లో వేణు నక్షత్రం ఉత్తమ డైరెక్టర్ గాను, నటుడు భూపాల్ రెడ్డి ఉత్తమ నటుడి అవార్డులను స్వంతం చేసుకున్నారు. గత సెప్టెంబర్ లో జరిగిన వాషింగ్టన్ డీసీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడ్డ ఒకే ఒక తెలుగు చిత్రం అవతలి వైపు. ఈ విధంగా ఎప్పుడూ ఏదో ఒక అవార్డుతో సోషల్ నెట్‌వర్క్ మీడియా వార్తల్లో హల్‌చల్ చేస్తున్న ఈ చిత్రాలు ప్రేక్షకుల కోరికపై అందరికీ అందుబాటులో ఉండడానికి ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గారి చేతుల మీదుగా నక్షత్రం ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేశారు. కోట్లు పెట్టి తీసే సినిమాల కన్నా ఒక్క మనిషిని ఆలోచింపజేసే సినిమానే మంచి సినిమా.
వాషింగ్టన్ డీసీలో నక్షత్రం ప్రొడక్షన్స్ సంస్థ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గారు ముఖ్య అతిథిగా పాల్గొని, నక్షత్రం ప్రొడక్షన్స్ ఆన్ లైన్ ఛానల్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేణు నక్షత్రం మూడు సినిమాలు(ఎంతెంత దూరం, అవతలివైపు, పిలుపు) చూసాను.. అన్నీ నిజంగా చాలాబాగా వున్నాయి. ఈ రోజు ఇండియాలో ఉన్న తల్లిదండ్రుల జీవితాలు గాని, ఇక్కడ (అమెరికాలో) ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళ జీవితాలు కాని, ఇలాంటి వారి జీవితాలకు అద్దం పట్టిన కథలను తీసుకొని సినిమాలు చేయడం బాగుంది అన్నారు. ఈ రోజుల్లో షార్ట్ ఫిల్మ్స్ అనగానే ఓ నలుగురు యువకులు గోడపై కూర్చుని అటుగా వెళ్తున్న అమ్మాయిల గురించి నాలుగు బూతులు మాట్లాడుతూ, అదే షార్ట్ ఫిలిం అని యూట్యూబ్ లో పెట్టి నాలుగు డబ్బులు సంపాదించుకోవడమే ఇప్పుడు చాలామంది ట్రై చేస్తున్నారు. ఆ విధంగా కాకుండా సమాజానికి పనికి వచ్చే విధంగా అంటే.. ఇప్పుడు వేణు నక్షత్రం అవతలి వైపు సినిమా చూసిన వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ తల్లిదండ్రులు గుర్తుకు రావడం, లేదా ఇంకొకరు ఎమోషన్ కి గురి కావడం మనం ఇప్పుడే చూశాము.. మన కళ్ళ ముందే కనపడుతున్నాయి వారి ఎమోషన్స్. అంటే ఒక సినిమా తీసిన తర్వాత ఆ సినిమా బాగా ఆడిందా లేదా, డబ్బులు వచ్చాయా లేదా అన్న దాని కన్నా ఒక్క మనిషినన్నా ఇన్స్పయిర్ చేయగలిగామా లేదా? ఆలోచింపజేయగలిగామా లేదా? అన్న సినిమా.. సినిమా అవుతుంది తప్ప కోట్లు ఖర్చు పెట్టగా .. బాహుబలి లాగ లక్షల కోట్లు వచ్చిన సినిమానే గొప్ప సినిమా కాదు.
ఒక మనిషిని ఇన్స్పయిర్ చేయగలిగే సినిమానే మంచి సినిమా అవుతుంది అని నా ఫీలింగ్.. ఆ నమ్మకంతోనే సినిమాలు తీశాను.. ఆడినవా, పోయినవా అని పట్టించుకోకుండా నా ఇష్టం కోసం సినిమాలు తీస్తున్నాను. ప్యాషన్ కోసం సినిమా తీస్తున్నాను. అంతే కాని, ప్రజలు చూస్తారు, డబ్బులు వస్తాయి అనే ఉద్దేశ్యంతో నేను సినిమాలు తీయలేదు.. అలాగే నక్షత్రం వేణు కూడా అలాగే చేస్తున్నాడు. పేరు లోనే స్టార్ వున్న అతను స్టార్ అవ్వాలని మనం అందరం కోరుకుందాము. అసలయిన కళాకారులు తెరమరుగయ్యారని, నటన రాని వారు, డైలాగులు కూడా చెప్పుకోలేని వారే ఇప్పుడు ఆర్టిస్టులుగా చలామణి అవ్వుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. షార్ట్ ఫిల్మ్స్ కి యూనియన్ ప్రకారం రేట్లు చెల్లించాల్సిన అవసరం లేదు అన్నారు. కొంత మంది అమెరికాలో తమ తల్లిదండ్రులని పని మనుషులుగా తెచ్చుకొంటున్నారని, అవతలి వైపు, పిలుపు చిత్రాలని ఉద్దేశించి అన్నారు, ముఖ్యంగా తల్లిదండ్రులపై భాద్యతగా ఉండటం ముఖ్యం.. ఆ ఇంపార్టెన్స్ వేణు నక్షత్రం ప్రతి చిత్రంలో కనపడుతుంది. స్క్రిప్ట్స్ అన్నీ బాగున్నాయి, చెప్పవలసిన విషయం చాలా సూటిగా చెప్పారు. అయితే ఇక్కడ సూచన చేస్తూ ప్రతి సినిమా చూసిన పది నిమిషాల్లోనే ఎమోషన్ కి గురి అవుతున్నారు, ఇంకా కొంత కొత్తదనాన్ని జోడిస్తూ అందరికీ నచ్చే విధంగా చెప్పే విషయాన్ని కొంత డిఫరెంట్ గా చెపితే కమర్షియల్ గా సక్సెస్ చేసుకొనే వీలు అవుతుంది. మీలో ఆ విధంగా చేసే టాలెంట్ ఉంది, ఆ విధంగా కృషి చేయాలని, ఇంకా మంచి మంచి చిత్రాలు రావాలని ఆశిస్తూ వేణు నక్షత్రం కృషిని తమ్మారెడ్డి భరద్వాజ అభినందించారు.