గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యులుగా రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ పోలిట్ బ్యూరో సభ్యుడు రాములు నాయక్ ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. సాసనమండలి చైర్మన్ నేతి విద్యాసాగర్ వీరితో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా హోంమంత్రి నాయిని మాట్లాడుతూ, తాను 1969 ఉద్యమం నుండి ఇప్పటివరకు జరిగిన తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించానని, అన్ని రకాల తెలంగాణ ఉద్యమాల్లో భాగస్వామినని గుర్తుచేశారు.
తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేసీఆర్ యూనివర్సిటీ విద్యార్థి అని, అయినా ఆయన నాయకత్వాన్ని స్వీకరించామని, ఇప్పటివరకు ఉద్యమాలు చేసిన వారందరిలోకీ కేసీఆర్ చాలా తెలివైన వ్యక్తి అని, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమాన్ని నడిపారని అన్నారు. తెలంగాణ అన్న పదమే ఉచ్ఛరించవద్దని గతంలో స్పీకర్ యనమల రామకృష్ణుడు అన్నారని, కానీ అప్పటినుండి ఈరోజు వరకు అన్ని పార్టీలు తెలంగాణ అనేలా చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని నాయిని పేర్కొన్నారు.
పోరాడితేనే తెలంగాణ అని గుర్తించినందునే అన్ని సంఘాలు, సంస్థలు, విద్యార్థులు, ఉద్యోగులు ఏకమై ఉద్యమాన్ని ఉధృతం చేశారని, దాని ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అన్నారు. ఉద్యమంలో తనకు కొన్ని దెబ్బలు తగిలినా నిలదొక్కుకున్నామని, తమ గౌరవాన్ని, కేసీఆర్ గౌరవాన్ని కాపాడుతూ ఉదయం చేశామని, తనకు ఎలాంటి పదవి లేకున్నా హోంశాఖ ఇచ్చారని, ఉద్యమకారులను గౌరవిస్తారనడానికి ఇదొక నిదర్శనమని నాయిని నర్సింహారెడ్డి చెప్పారు.
ఎమ్మెల్సీ రాములునాయక్ మాట్లాడుతూ 2001లో గులాబీకండువా కప్పుకుంటే తమను చూసి నవ్వారని, ఇప్పుడు అదే కండువాతో ఉన్న తాము కారు మాది, సర్కారు మాది, సెక్రెటేరియట్ మాది, గజ్వేల్ మాది అని అంటున్నామని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన కార్మికులు, గిరిజనులు, రైతుల సమస్యల పరిష్కారం కోసం శాసనమండలిలో కృషి చేస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతిపై ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు.