By: D V Rajesh
35 ఏండ్లచ్చినయ్ పెయ్యి మీదికి. ఎన్ని బతుకమ్మ పండుగులు సూషిన్నొ….కని ఇప్పుడేందొ ఎల్తిగనిపిస్తంది.
తెలంగాణ రాష్ట్రంల మొదటి బతుకమ్మ పండుగ మిస్ అయితున్న అని గావచ్చు. అన్ని ఊర్లల్లకు వోయి సూడాలనిపిస్తంది ఈ 9 రోజులు గూడ. కనేం జేస్తం, ఫ్రయివేటు నౌకరాయె పట్నంల, సెలవులియ్యరు గన్ని రోజులు.
మరీ చిన్నప్పుడైతె అమ్మమ్మ వాల్ల ఊరుకు వోతుండె. జర సోయచ్చిన కాడికెల్లి మా ఊల్లెనే జరుపుకుంటుండె. పెద్ద బతుకమ్మ దగ్గర వడ్తున్న కొద్ది మస్తు ఆరాటం ఉంటుండె. సైకిలు మీద గుట్ట కిందికి, పెద్ద కెనాలు కింద పొలాల కాడికి పొయ్యేది. ఆడికి వొయ్యి గునుగు పువ్వు కోస్కోని, గడ్డి మోపు లెక్క కట్టుకొని ఇంటికచ్చి గునుగు కట్టలు గట్తుండె.
మా అమ్మ రంగునీల్లల్ల కలిపి ఉంచేది. బ్లూ కలర్, గ్రీన్ కలర్ పక్కా.. ఇంకేవన్న ఒకటో రెండో కలర్లు ఉంటుండే. గునుగు పువ్వు కట్టలకు కలర్లు అద్ది నీడల ఆరవెడ్తుండే. ఇగ పింక్ కలరు కోసం సీత జడ పువ్వులు, ఎల్లో కలరుకు తంగేడు పువ్వు… వైట్ కలరుకు రంగులెయ్యని గునుగునే పెడ్తుండే.
పెద్ద బతుకమ్మ నాడు పొద్దుగాల పొద్దుగాలనే హంగామా షురూ. మా అమ్మ ఒక్క పొద్దు ఉంటది పెద్ద బతుకమ్మ నాడు. 10-11 గంటలకు బతుకమ్మ పేర్సుడు మొదలైతుండె. ఆ ఇంటికి ఈ ఇంటికి పోయి అందరి బతుకమ్మలు సూస్కుంట సూస్కుంట అచ్చి, ఎవలి బతుకమ్మ పెద్దగుందో అప్ డేట్ ఇస్తుండె ఇంట్ల. మస్తు ట్రై జేస్తుండె మా బతుకమ్మనే పెద్దగ రావాలని. బతుకమ్మ మొత్తం పేర్సుడు అయినంక గౌరమ్మ లెక్క గుమ్మడి పువ్వులోపట ఉండే బొడ్డెమ్మను పెట్టేటోల్లం. (“Gummadi puvvu la boddemma” is the big Yellow coloured stock like Androecium of Pumpkin flower). అది దొరకక పోతే పసుపు ముద్ద పెట్టి కుంకుమ బొట్లు పెడ్తుండె.
మొత్తానికి ఈవినింగ్ 3-4 గంటలకు ఒక్కొక్క గ్రూపు బైలెల్లుతుండె. పెద్ద కెనాల్ కాడికి పొయ్యి ఆడుతుండె అందరు. మరీ పెద్దగ ఉండే బతుకమ్మలను మొగోల్లే మోసుకచ్చెది. ఆడి పిలగాండ్లు రంగు రంగుల లంగా ఓనీలు యేస్కోని అచ్చెటోల్లు బతుకమ్మ ఆడనీకి. అరే ఏమన్న ఉంటుండెన ఆల్లు లంగా ఓనీలల్ల.. మస్తుంటుండె పో.
ఒక్కొక్క గ్రూపు 10-20 బతుకమ్మలను ఒక కాడ పెట్టి సుట్టు రౌండు తిరుక్కుంట బతుకమ్మ పాటలు పాడేది. లాస్టుకు జర ఇగ చీకటి అయితుందనంగ సద్దులు పంచెటోల్లు. మక్కల సత్తు పిండి, పల్లి పిండి, నువ్వుల పిండి, కొబ్బరి పిండి, నెయ్యి కలిపిన పెసరి ముద్దలు, మినుము ముద్దలు (ఈటిని ఆంధ్రోల్లు సున్నుండ అంటరు). మస్తుగ లాగిస్తుండె.
ఇగ మెల్లగ బతుకమ్మ నిమజ్జనం మొదలయ్యేది. పెద్ద కెనాల్ ల ఇడిసెటోల్లం. బతుకమ్మల పైన దీపాలు, లేకుంటె కాండిల్ పెట్టి ఇడిసేది.
మొత్తం బతుకమ్మలు ఇడిసే సరికి చీకటి పడేది. ఆ చీకట్ల …పారే నీల్లల్ల బతుకమ్మలు పోతాంటె..మీద దీపాలు …సూపర్ ఉండేది సీను అసలు దూరం కెల్లి…అట్ల కనవడేంత దూరం దాక బతుకమ్మలను సూస్కుంట సూస్కుంట ఇంటి మొకం పట్టేది.
PEDDA BATUKAMMA…….MISSING ALL THOSE DAYS VERY BADLY…..