ఓటర్ల సమస్యల పరిష్కారానికి ‘నా ఓటు’ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చామని, దీని ద్వారా ఓటు వివరాలు సంపూర్ణంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ చెప్పారు. బుధవారం హరిత ప్లాజాలో ఎన్నికల విభాగం ఆధ్వర్యంలో ఈవీఎంలు, వీవీప్యాట్లు, ఎన్నికల నిర్వహణపై రేడియో జాకీలకు ఒకరోజు అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఈవో రజత్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో రేడియోకు ఎంతో ప్రాధాన్యం ఉందని, గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదు అవుతున్నదని, పట్టణ ప్రాంతాల్లో కూడా ఓటింగ్ నమోదును పెంచేందుకు ఆయా రంగాలవారీగా అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు విలువ, ప్రాధాన్యం వివరించేందుకే రేడియో జాకీలకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల నియమావళికి లోబడే ఓటు తొలగింపు ఉంటుందని, ఓటు తొలగించే ముందు నోటీస్ ఇవ్వడమే కాకుండా ఎన్నికల కమిషన్ కు కూడా సమాచారం ఇస్తామని రజత్ కుమార్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఓట్ల తొలగింపు ప్రక్రియ చాలా విమర్శలకు దారి తీసిందని, సరైన విధానంలోనే 99 శాతం ఓట్లు తొలగించినట్లు చెప్పారు. కొత్తగా 26 లక్షల మంది ఓటుహక్కు నమోదు చేసుకున్నారని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకున్నాక తిరిగి పరిశీలించుకోవాలని సూచించారు. తప్పుడు ధృవీకరణ పత్రాలతో కొందరు ఓటర్లుగా పేర్లను నమోదు చేశారని, అందుకు బాధ్యులైన డాటా ఎంట్రీ ఆపరేటర్లపై కఠిన చర్యలు ఉంటాయని రజత్ కుమార్ వెల్లడించారు.