సోమవారం విడుదలైన మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో టీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ కార్పొరేషన్, 8 మున్సిపాలిటీలను దక్కించుకుని గతంలోకంటే మెరుగైన స్థానంలో ఉంది. గతంలో కొన్ని జిల్లాలకే పరిమితమైన టీఆర్ఎస్ పార్టీ ఈసారి అన్ని జిల్లాల్లో పోటీకి దిగింది. ఇంకో విషయం ఏమిటంటే టీఆర్ఎస్ పక్కా రాజకీయ పార్టీ అని కేసీఆర్ ప్రకటించకముందే మున్సిపల్, స్థానిక ఎన్నికలు జరిగాయి. 2001 నుండీ పార్టీ స్థానిక ఎన్నికలపై దృష్టి పెట్టలేదని, తెలంగాణ రాష్ట్ర సాధనే తమ లక్ష్యం అయినందున ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలనే గెలుస్తూ వచ్చిందని, అందుకే మున్సిపల్ ఎన్నికల్లో భారీ మెజార్టీని సాధించలేకపోయిందని పార్టీ నేతలు అంటున్నారు.
అధికార పార్టీ అయిన కాంగ్రెస్ కు చాలా చోట్ల టీఆర్ఎస్ గట్టిపోటీ ఇచ్చింది. పార్టీ అధినేత కేసీఆర్ చెప్పినట్లు ఖమ్మం జిల్లాలో కూడా సత్తా చాటింది. ఇల్లందులో మూడు, కొత్తగూడెంలో రెండు వార్డులను సొంతం చేసుకుంది. ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, మెదక్, వరంగల్ జిల్లాలలో 8 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ కైవసం చేసుకుంది. 16న వెల్లడికానున్న సార్వత్రిక ఎన్నికల్లో సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం కాబట్టి మెజారిటీ స్థానాలు తమకే దక్కుతాయని, మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో మరో 10 మున్సిపాలిటీలను గెలుచుకుంటామని టీఆర్ఎస్ నేతలు ధీమాగా ఉన్నారు.