mt_logo

ములాయం మాట మంత్రదండమా?

By: రాజు ఆసరి

 

తెలంగాణపై 7 డిసెంబర్ 2009న అఖిలపక్ష సమావేశం జరిగింది. అందులో అధికార పార్టీ మొదలు అన్ని పార్టీలు (ఎంఐఎం, సీపీఎం) తప్పా అన్నీ పార్టీలు జై కొట్టాయి. 9 డిసెంబర్ 2009న అప్పటి కేంద్ర హోంమంత్రి తెలంగాణ ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రకటించారు. దీంతో ఏదో భూమి బద్దలైనట్టు సీమాంధ్ర మీడియా తెలంగాణపై విషాన్ని చిమ్మింది. అంతే డిసెంబర్ 10 మానవహక్కుల దినం రోజు అర్ధరాత్రి ప్రకటన అంటూ తెలంగాణపై రాష్ట్రంలోని ‘సైకిల్’ పార్టీ యూటర్న్ తీసుకుంది. దీన్ని సాకుగా చూపి సీమాంధ్రలో హస్తం పార్టీ నేతలు ‘రాజీ’డ్రామాలతో హస్తిన పెద్దలను బెదిరించారు. దీనికి కర్త, కర్మ, క్రియ నాటి ముఖ్యమంత్రి రోశయ్య, ప్రతిపక్ష నేత చంద్రబాబు, నాటి స్పీకర్ నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి. (వీళ్లతో జతకట్టిన సామాజిక తెలంగాణ నుంచి సమైక్య పాత్రలోకి ఓ హీరో జంప్ అయ్యాడు. మరో యువనేత తెలంగాణకు వ్యతిరేకంగా పార్లమెంటులో ప్లకార్డు పట్టుకున్నాడు) ఈ ముగ్గురు త్రిమూర్తులు కలిసి వచ్చిన తెలంగాణ ప్రకటన వెనక్కిపోయేలా చేశారు. ఇదంతా చరిత్ర.

రాష్ట్రంలో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వెనక్కి తగ్గింది. అప్పుడే సీమాంధ్ర, తెలంగాణల మధ్య స్పష్టమైన విభజన రేఖ ఏర్పడింది. ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో సీమాంధ్ర పార్టీలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. ఇది రాజశేఖర్ రెడ్డి రెక్కల ప్రభుత్వం అని, అలాంటి నేత పేరు సీబీఐ చార్జిషీట్‌లో పేర్కొనడాన్ని నిరసిస్తూ జగన్‌కు జై కొట్టి కొంతమంది రాజీనామా చేశారు. తెలంగాణ ప్రాంతంలో ప్రజల ఆకాంక్ష ముందు ఏ నేత ఛరిష్మా పనిచేయలేదు. ఏ కుట్రలు ఫలించలేదు. కానీ జగన్ కోసం చేసిన రాజీనామాల్లో రెండు స్థానాలు కోల్పోయింది రాజన్న పార్టీ. పాలమూరులో టీఆర్‌ఎస్ ఓడిపోగానే భూతద్దంలో చూపెట్టి, పరకాలలో గెలిచినా అతి స్వల్ప మెజారిటీ అని మీడియా విష ప్రచారం చేసింది. అదే రాజన్న పార్టీ రెండుస్థానాలు కోల్పోయినా అవి కాంగ్రెస్ పార్టీ సీట్లే అని వాళ్లు అనగానే అయితే ఓకే అన్నాయి. ఈ ప్రాంత ప్రజల చైతన్యం ముందు సీమాంధ్ర పెట్టుబడిదారుల కుట్రలు, మీడియా జిమ్మిక్కులు పనిచేయలేదు. ఇప్పుడు కూడా రాష్ట్రంలో (నాటి 7 డిసెంబర్ 2009 అఖిలపక్ష సమావేశంలో వ్యతిరేకించిన పార్టీలు తప్పా) ఏ పార్టీ నై తెలంగాణ అనలేని పరిస్థితి. అందుకే టీజీ వెంకటేష్, లగడపాటి లాంటి వాళ్లు మెజారిటీ ప్రజలు సమైక్యవాదాన్నే కోరుకుంటున్నారు అని చెప్పారు. ఇప్పటికీ చెబుతున్నారు. కానీ దాన్ని సీమాంధ్ర మీడియా మాత్రమే నమ్ముతున్నది. అందుకే టీజీ వెంకటేష్ చంద్రబాబును, విజయమ్మును ఒకే ఒక వాక్యం లెటర్‌పై రాసి ఇవ్వమని బతిమిలాడుకుంటున్నాడు. సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నామని ఒకే ముక్క రాసి ఇస్తే హస్తినకు వెళ్లి తెలంగాణను అడ్డుకుంటామంటున్నాడు. తెలంగాణ అనుకూల ప్రకటన వస్తే రాజీనామాలు చేస్తామని కొన్నిరోజులుగా సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు (కొంతమంది ఇప్పటికే రాజీనామా చేశారు కూడా) అంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆ రాజీనామాల ప్రభావం రాష్ట్రంలో మీడియాలో చర్చలకే పరిమితమవుతున్నది.

నాడు తెలంగాణపై ఏపీ సైకిల్ అడ్డం తిరిగితే తెలంగాణ ప్రక్రియ ఆగిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకూడదు అనుకుంటే తప్పా ఎవరు అడ్డుకున్నా ఆగదు. కానీ రాత్రి ఓ విందుకు హాజరైన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత ములాయం తెలంగాణకు ఒప్పుకునేది లేదు అనగానే ఒక వర్గం మీడియాకు ఎక్కడాలేని ఆనందం కలిగింది. నిజానికి ములాయం తెలంగాణకు వ్యతిరేకమని దశాబ్ద కాలంగానే చెబుతున్నాడు. అందుకే తెలంగాణకు అనుకూలంగా దేశవ్యాప్తంగా ప్రణబ్ కమిటీకి ముప్ఫై పైచిలుకు పార్టీలు ఇస్తే, ఎస్పీ వ్యతిరేకించిన విషయం విదితమే.కానీ ములాయం ఇప్పుడే కొత్తగా తెలంగాణను వ్యతిరేకించినట్టు మీడియా ప్రచారం చేస్తున్నది. ములాయం తెలంగాణకు అడ్డుతిరగడంతో తెలంగాణ అంశం మళ్లీ మొదటికి వస్తుందా అని ఊహాజనిత కథనాలు ప్రసారం చేస్తున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ యూపీఏలో భాగస్వామ్య పార్టీ కాదు. ఆ పార్టీ యూపీఏకు బయటి నుంచి మాత్రమే మద్దతు ఇస్తున్నది. కాబట్టి తెలంగాణపై యూపీఏ తీసుకునే నిర్ణయానికి యూపీలో అధికార పార్టీ అధినేత అభిప్రాయానికి ముడిపెట్టడం అంటే మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టడమే అవుతుంది. కేంద్రంలోని ఎన్డీఏ, యూపీఏలోని మెజారిటీ భాగస్వామ్య పక్షాలు తెలంగాణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. యూపీఏలోని ప్రధాన భాగస్వామ్యపక్షమైన ఎన్సీపీ, ఆర్‌ఎల్‌డీ తెలంగాణ ఉద్యమ వేదికలపై వచ్చి తమ మద్దతు తెలిపిన విషయాన్ని మరిచిపోవద్దు. అలాగే ములాయంకు తెలంగాణపై అవగాహన లేదనడానికి ఆయన మాటలే ఉదాహరణ. అయిష్టంగా ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం మంచిది కాదన్నారు. ఆ అయిష్టత కొంతమంది పెట్టుబడిదారుల్లో తప్ప సామాజన్య ప్రజానీకంలో లేదన్న విషయం ఆయనకు తెలియదు. అంతేకాదు రాష్ట్రంలో అధికార పార్టీ మొదలు ప్రధాన ప్రతిపక్షం దాకాపజాప్రతినిధుల వ్యతిగత అభిప్రాయాలు ఏవైనా) ఏ పార్టీకూడా నేరుగా తెలంగాణను వ్యతిరేకించడం లేదు. మరి అలాంటప్పుడు ములాయం తెలంగాణకు వ్యతిరేకంగా ఓటు వేస్తే రాష్ట్ర విభజన ఆగుతుందా అనేది ఆలోచించకుండా,  ఓ వర్గం మీడియా ఎందుకు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. డిసెంబర్ 9 తర్వాత రాష్ట్రంలో ఇటు తెలంగాణ ప్రాంతంలో ఇంటి దొంగలు ఎవరు, అటు సీమాంధ్ర ప్రాంతంలో తెలంగాణ వ్యతిరేకులు ఎవరో తెలిపోయింది. అందులో మీడియా కూడా ఉన్నది. నాటి చిదంబరం తర్వాత ఇరు ప్రాంతల ప్రజల మధ్య మానసిక విభజన వచ్చేసింది. అక్కడి సామాన్య ప్రజలు, ప్రజాస్వామికవాదులు, బుద్ధిజీవులు కూడా జై తెలంగాణ, జై ఆంధ్ర అంటున్నారు. ఈ సమయంలో మీడియా తమ రేటింగ్స్ పెంచుకోవడం కోసం అరిగిపోయిన పాత మాటను పతాకశీర్షికకు ఎత్తుకోవడమే ఇప్పటి విషాదం. రాష్ట్ర విభజన ఖాయమని తేలిపోయింది. అయితే ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నది హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణనే. అంటుమొక్కను అంగీకరించే ప్రసక్తే లేదంటున్నారు. కాబట్టి కేంద్రం నుంచి వచ్చే ఆ ప్రకటన ఏమిటన్నదే ప్రశ్న. అంతేకానీ ఉత్తరాది రాష్ట్రంలో యూపీ ‘సైకిల్’ పార్టీ యూటర్న్ తీసుకున్నా, పల్టీలు కొట్టినా ఉపద్రవం ఏదీ రాదు. తెలంగాణపై ములాయం మాట మంత్రదండం అంతకంటే కాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *