రాష్ట్ర హక్కులను సాధించుకోవడానికి కేంద్రంపై రాజీలేని పోరాటం చేస్తామని టీఆర్ఎస్ ఎంపీ కవిత స్పష్టం చేశారు. ఫేం ఇండియా-ఏషియా పోస్ట్ మ్యాగజైన్ ఉత్తమ పార్లమెంటేరియన్ (శ్రేష్ట్ సంసద్) అవార్డును ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర మధ్య, సూక్ష్మతరహా పరిశ్రమలశాఖ సహాయమంత్రి గిరిరాజ్ సింగ్ చేతులమీదుగా ఎంపీ కవిత అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిజామాబాద్ ప్రజల దీవెనలతోనే ఈ అవార్డు దక్కిందని, మరింత ఉత్సాహంగా పనిచేస్తానని అన్నారు.
రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణకు సంబంధించిన అంశాలు ఏవీ లేవని ఐదేళ్ళలో కేంద్రం రైతులకు, మహిళలకు ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టలేదని, ఇప్పుడు ఎన్నికల ముందు బడ్జెట్ లో ఏవైనా ప్రవేశపెట్టినా అవి అమలుచేసేలోపే ఎన్నికలు పూర్తవుతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వడంలేదని, బైసన్ పోలో భూముల అప్పగింతను కేంద్రం నానుస్తుందన్నారు.
అవార్డు అందుకున్న ఎంపీ కవితను పలువురు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అభినందించారు. టీఆర్ఎస్ ఎంపీలు, మహిళా నేతలు, కార్పోరేషన్ చైర్మన్లు, జాగృతి నాయకులు, ఎంపీ కవిత అభిమానులతోపాటు ఇతరదేశాల్లో ఉన్న టీఆర్ఎస్ ఎన్నారై విభాగ అధ్యక్షుడు మహేష్ బిగాల, ఆస్ట్రేలియా విభాగం అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి, అనిల్ కూర్మాచలం, చాడ సృజన్ రెడ్డి తదితరులు అభినందనలు తెలిపారు.