బంగారు బతుకమ్మలను ఎత్తుదాం.. బంగారు తెలంగాణ నిర్మిద్దాం.. ఇదే మన నినాదమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత అన్నారు. సోమవారం వరంగల్ జిల్లా నర్సంపేటలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బంగారు బతుకమ్మ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత బతుకమ్మ ఆడి సందడి చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఉద్యమ బతుకమ్మలను ఎత్తి తెలంగాణను సాధించుకుంటామని చెప్పి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని, తెలంగాణ పునర్నిర్మాణంలో మహిళాశక్తి తిరుగులేనిదని పేర్కొన్నారు. బంగారు తెలంగాణగా మార్చుకునేందుకు ఆడబిడ్డలంతా పట్టుదలతో పనిచేయాలని, ఆడపిల్లలకు చదువెందుకనే పరిస్థితి మారాలని, ప్రతి ఆడపిల్లను ఉన్నతంగా తీర్చిదిద్దాలని కవిత సూచించారు.
రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కృషి చేస్తున్నారని, కేజీ టూ పీజీ విద్యను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలిపారు. అంతకుముందు ఎంపీ కవిత వరంగల్ పట్టణమంతా కలియతిరిగి సంజీవని అనాధాశ్రమంలో బతుకమ్మలు పేర్చారు. అనంతరం అంగడి మైదాన్ లో వేలాదిమంది ఆడబిడ్డలతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. ఇదిలాఉండగా మరోవైపు రాష్ట్రంలోని పదిజిల్లాల్లో ఎంగిలిపూల బతుకమ్మ సంబురాలు అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. చెరువుల వద్ద, గుడుల వద్ద రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలతో తెలంగాణ ఆడబిడ్డలంతా సందడి చేశారు. హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రుల సతీమణులు బతుకమ్మ సంబురాల్లో పాల్గొని సందడి చేశారు.