నాగార్జున యూనివర్సిటీలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బీఆర్క్ విద్యార్ధిని రిషితేశ్వరి కేసుకు సంబంధించి సమగ్ర విచారణ జరపాలని కోరుతూ టీఆర్ఎస్ ఎంపీ కవిత ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. వరంగల్ కు చెందిన రిషితేశ్వరి మృతి వెనుక సమాజంలో అత్యంత పలుకుబడి, అండదండలు ఉన్న వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని, నిజానిజాలు తేలాలంటే సమగ్ర విచారణ జరిపించాలని కవిత కోరారు. కొందరు విద్యార్థులు రిషితేశ్వరిని ర్యాగింగ్ పేరుతో లైంగిక వేధింపులకు గురి చేసినట్లు, ఆ వీడియో దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ కూడా చేసినట్లు వార్తలు వచ్చాయని లేఖలో పేర్కొన్నారు.
రిషితేశ్వరి బలవన్మరణం ఎంతో కలవరానికి గురిచేసిందని, మహిళల భద్రతను కాంక్షించేవారికి ఆందోళన కలిగిస్తున్నదని కవిత అన్నారు. ఇలాంటి అరాచక చర్యలకు పాల్పడిన విద్యార్థులను అధ్యాపకవర్గంలోని కొందరు ప్రోత్సహించినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో పూర్తి వాస్తవాలు వెలుగులోకి రావాలంటే నిష్పాక్షికమైన విచారణ జరగాలని, అందుకు తగిన చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబుకు కవిత విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఇలాంటి సంఘటనలపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉండడం ద్వారా భవిష్యత్తులో మరెవ్వరూ రిషితేశ్వరి తరహాలో బలవన్మరణం కాకుండా భరోసా కల్పించగలమని కవిత సూచించారు.