రాష్ట్రంలో కొత్తగా ఎనిమిది పారిశ్రామిక వాడలు

  • October 13, 2021 12:58 pm

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో కొత్తగా ఎనిమిది చిన్న, మధ్య తరహా పారిశ్రామికవాడలు ఏర్పాటు కానున్నాయి. వచ్చే ఏడాది జనవరి నాటికి వీటిలో పనులు మొదలవుతాయని పరిశ్రమలశాఖ అధికారులు తెలిపారు. కాగా ఈ ఎనిమిదింటిలో బుగ్గపాడు, కల్లెం, నర్మాల, కుందనపల్లి పార్కులు పనులు పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. వీటితోపాటు ఇప్పటికే కొనసాగుతున్న మరో 12 పార్కులను టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో అప్‌గ్రేడ్‌ చేయడానికి చర్యలు తీసుకోనున్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోని పారిశ్రామికాభివృద్ధికి పెద్ద ఎత్తున చర్యలు చేపట్టాలని నిర్ణయించగా.. ప్రత్యేకంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటు ద్వారా జిల్లాల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో ఎనిమిది ఎంఎస్‌ఈ పార్కులను ఏర్పాటుచేస్తున్నారు. ఒక్కొక్క పార్కు సుమారు 50-60 ఎకరాల్లో ఉంటుంది. ఈ పార్కుల పనులు తుది దశకు చేరుకొన్నాయి. రోడ్లు, మంచినీరు, డ్రైనేజీ, విద్యుత్‌ తదితర మౌలిక సదుపాయాల ఏర్పాట్లు పూర్తికావచ్చినట్లు అధికారులు తెలిపారు. అప్‌గ్రేడ్‌ చేయనున్న 12 పార్కుల్లో ఒక్కో దానికి రూ.10 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. వీటికి సంబంధించి నిధుల విడుదలకు కేంద్రానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపించారు. కేంద్రం నుండి నిధుల ఆమోదం అందగానే నైపుణ్యశిక్షణ కేంద్రాలు, అదనపు మౌలిక సదుపాయాల కల్పన పనులు మొదలవుతాయి. రానున్న కొత్త పార్కుల్లో వేలమందికి అవకాశాలు లభించనున్నాయి.


Connect with us

Videos

MORE