పల్లె దవాఖానల్లో మరో 1,492 మంది వైద్యులను కాంట్రాక్ట్ పద్ధతిన నియమించేందుకు రాష్ట్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రోగాలను ప్రాథమిక స్థాయిలోనే నిర్థారించి, చికిత్స అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పల్లె దవాఖానలను ఏర్పాటు చేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 4,745 ఏఎన్‌ఎం సబ్ సెంటర్లు ఉండగా, ఇందులో 3,206 సబ్ సెంటర్లను పల్లె దవాఖానలుగా అభివృద్ధి చేస్తున్నది. వీటికోసం ఇప్పటికే తొలి విడతగా 1,569 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ సర్వీసెస్ (ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించేందుకు వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుతం నియామక ప్రక్రియ కొనసాగుతున్నది. తాజాగా మరో 1,492 మంది ఎంఎల్‌హెచ్‌పీలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మొత్తం 3,061 పోస్టులు భర్తీ కానున్నాయి.
రాష్ట్రంలోని 3,206 సబ్ సెంటర్లను పల్లె దవాఖానలుగా మార్చుతుండటంతో పల్లెలకు ఎంబీబీఎస్ వైద్యులు అందుబాటులోకి రానున్నారు. ఇప్పటికే పీహెచ్‌సీల్లో మెడికల్ ఆఫీసర్లుగా ఎంబీబీఎస్ వైద్యులు పనిచేస్తున్నారు. వీరికి అదనంగా మరో మూడు వేల మంది గ్రామాల్లో సేవలు అందించేలా పల్లె దవాఖానలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత నాణ్యమైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ దవాఖానల్లో ఓపీతోపాటు అవసరమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలను నిర్వహించనున్నారు. నమూనాలను సేకరించి, టీ డయాగ్నస్టిక్స్ కేంద్రాలకు పంపి పరీక్షలు చేయనున్నారు. వ్యాధి నిర్ధారణ ఫలితాలను బట్టి అవసరమైన చికిత్స అందిస్తారు. తద్వారా వ్యాధి ముదరక ముందే గుర్తించే అవకాశం కలుగుతుంది. బాధితులు ధైర్యంగా ఉంటారు. ఒకవేళ తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు గుర్తిస్తే వెంటనే పై దవాఖానలకు రెఫర్ చేస్తారు.