విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌తోపాటు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జలవిహార్ లో ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… యశ్వంత్ సిన్హాకు తెలంగాణ ప్రజలు, ప్రజాప్రతినిధుల తరపున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నామన్నారు. యశ్వంత్ సిన్హా ఉన్నత వ్యక్తిత్వంగలవారని తెలిపారు. న్యాయవాదిగా కెరీర్‌ను ప్రారంభించారని, వివిధ హోదాల్లో దేశానికి అత్యుత్తమ సేవలందించారని పేర్కొన్నారు. ఆర్థిక మంత్రిగా పనిచేశారని, ఆయనకు అన్ని రంగాల్లో విశేష అనుభవముందని తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఆత్మప్రభోదానుసారం ఓటు వేయాలని సీఎం కేసీఆర్ కోరారు. ఉత్తమ, ఉన్నతమైన వ్యక్తి రాష్ట్రపతిగా ఉంటే దేశ ప్రతిష్ట మరింత పెరుగుతుందని తెలిపారు. దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావాల్సి ఉందన్నారు. ప్రధాని మోదీ ఇవాళ హైదరాబాద్ వస్తున్నారని, తాము వేసిన ప్రశ్నలకు హైదరాబాద్ వేదికగా ప్రధాని మోదీ సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ ఇచ్చిన హామీల్లో టార్చిలైట్ వేసి వెతికినా ఆయన నెరవేర్చిన హామీలు ఒక్కటీ కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. కేంద్ర సర్కారు డీజిల్ సహా అన్ని ధరలు పెంచేసిందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఇవి చాలదన్నట్లు నల్ల చట్టాలు తెచ్చి రైతులను ఇబ్బంది పెట్టారన్నారు. వ్యవసాయ చట్టాలపై రైతులు సుదీర్ఘ పోరాటం చేశారని, ఉద్యమంలో మృతి చెందిన రైతులు కుటుంబాలకు తాము రూ.3 లక్షలు ఇస్తే, బీజేపీ తమను చులకనగా చూసిందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. రైతు చట్టాలు సరైనవే అయితే వాటిని వెనక్కు ఎందుకు తీసుకున్నారో చెప్పాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. మోదీ..ప్రధానిగా కాకుండా దేశానికి సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నారని మండిపడ్డారు. మోదీ తీరుతో శ్రీలంకలో ప్రజలు నిరసనలు తెలిపారని గుర్తుచేశారు. శ్రీలంక చేసిన ఆరోపణలపై ప్రధాని మౌనమెందుకు వహిస్తున్నారని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.
మోదీ ఎనిమిదేళ్ల పాలనలో ద్రవ్యోల్బణం పెరిగిపోయిందని, సామాన్యుడు బతుకలేని పరిస్థితి నెలకొందని సీఎం కేసీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. వికాసం పేరుతో దేశాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. ప్రధాని మోదీ అవినీతిరహిత భారత్ అని పెద్దపెద్ద మాటలు చెప్పారని, ఎంత నల్లధనం వెనక్కి తీసుకొచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీపాలనలో అవినీతిపరులు పెరిగిపోయారన్నారు. నల్లధనం నియంత్రణ కాదు.. రెట్టింపైంది.. ఇదేనా వికాసం? అని ప్రశ్నించారు. మోదీ ప్రధానిగాకాదు..దోస్త్ కోసం షావుకార్‌గా పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ వ్యవస్థలను ప్రధాని మోదీ దుర్వినియోగం చేశారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. దేశంలో రైతులు, సైనికులు, నిరుద్యోగులు, ఉద్యోగులు ఇబ్బందిపడుతున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. మోదీ పనితీరుతో అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ట దిగజారుతోందన్నారు. దేశంలో సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నా..విదేశాలనుంచి బొగ్గు కొనాలని రాష్ట్రాలకు కేంద్రం హుకుం జారీచేస్తున్నదని ముఖ్యమంత్రి మండిపడ్డారు. మోదీపై జనంలో ఆగ్రహం పెరుగుతోందని తెలిపారు. మోదీ ఎన్నికలప్పుడు తియ్యటి మాటలు చెబుతారని ఎద్దేవా చేశారు. ఎనిమిదేళ్లలో దేశంలో భారీ స్కాంలు జరిగాయన్నారు. రూపాయి పతనం చూస్తే మోదీ పాలన ఏంటో అర్థమవుతోందన్నారు. మేక్ ఇన్ ఇండియా అనేది శుద్ధ అబద్దమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మోదీతో తనకు వ్యక్తిగత విభేదాలు లేవన్నారు. మోదీ విధానాలతోనే తమకు అభ్యంతరమని పేర్కొన్నారు. తాము మౌనంగా ఉండబోమని, పోరాటం చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.