mt_logo

త్యాగాలతో మొదలైన చరిత్ర టీఆర్ఎస్ పార్టీది- ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈరోజు టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. దేశ ముఖ చిత్రాన్ని మారుస్తూ దేశంలోనే వరి ధాన్యం పండించడంలో తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. ఇక్కడ వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చని అన్నారు.

మొదటినుండీ కష్ట నష్టాలను ఎదుర్కొంటూ ఎదిగిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని ఆమె గుర్తు చేశారు. త్యాగాలతో మొదలైన చరిత్ర టీఆర్ఎస్ పార్టీ సొంతం.. నాడు జలదృశ్యంలో కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించినప్పుడు అనేక మంది ఉద్యమకారులు అండగా నిలిచారని, చంద్రబాబు నాయుడు టీఆర్ఎస్ కు జాగా లేకుండా విశ్వప్రయత్నం చేశారని గుర్తుచేశారు. అయినా పిడికెడు మందితో ప్రారంభమైన పార్టీ ఈరోజు చరిత్ర తిరగరాస్తుందంటే అది కార్యకర్తల బలమేననని, చిన్న మొక్కలా ప్రారంభమైన పార్టీ ఇప్పుడు మహా వృక్షంలా మారింది అంటే బలమైన కార్యకర్తల కృషేనని కవిత ప్రశంసించారు.

తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పుట్టింది.. గులాబీ కండువా ఒక బాధ్యతతో కూడుకున్నది. సీఎం కేసీఆర్ కార్యకర్తలపై ప్రేమతో సభ్యత్వ నమోదులో భీమా పథకం తెచ్చారు. పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని కవిత స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు చేసే విమర్శలకు కార్యకర్తలు గట్టిగా బుద్ది చెప్పాలని, ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచుకోవాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే గణేశ్ గుప్తా, ఎమ్మెల్సీ ఆకుల లలిత, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *