mt_logo

బీజేపీది రామ్ రామ్ జప్నా… పరాయి లీడర్ అప్నా పాలసీ : కేంద్ర ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత మండిపాటు

బీజేపీ నాయ‌కులు రాముని పేరు చెప్పి రౌడీయిజం చేస్తున్నార‌ని ఎమ్మెల్సీ కవిత మండిప‌డ్డారు. ఈడీ దాడుల‌కు భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తే లేద‌ని క‌విత తేల్చిచెప్పారు. బుధవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేంద‌ర్ ఆధ్వ‌ర్యంలో ఎల్లారెడ్డిపేట మండ‌ల ప‌రిధిలోని నాగిరెడ్డిపేట‌లో నిర్వ‌హించిన‌ టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల ఆత్మీయ స‌మ్మేళ‌నంలో ఎమ్మెల్సీ క‌విత పాల్గొని ప్ర‌సంగించారు. నెల రోజుల నుంచి తెలంగాణ‌లో ఐటీ దాడులు చేస్తున్నారు. ఒక్క మంత్రిని, ఎమ్మెల్యేను, ఎంపీని విడిచిపెట్ట‌డం లేదు. లీగ‌ల్‌గా వ్యాపారం చేసుకుంటున్నారు. దాంట్లో త‌ప్పేముంది. అధికారులు అడిగితే స‌మాధానం చెప్తారు. తెలంగాణ వాళ్లు భ‌య‌ప‌డేవాళ్లు కాద‌ని క‌విత స్ప‌ష్టం చేశారు.

మ‌న ఎమ్మెల్యేల‌ను కొన‌డానికి కొంద‌రు ప్ర‌య‌త్నించారు. అడ్డంగా దొరికిన దొంగ‌ల‌ను మ‌నం విచార‌ణ చేయ‌కూడదంట‌. దొరికిన దొంగ‌ల‌పై విచార‌ణ చేయొద్ద‌ని పిటిష‌న్లు వేశారు. కోర్టు నుంచి స్టే తెచ్చారు. అయినా మ‌నం సుప్రీంకోర్టుకు వెళ్లి ఆర్డ‌ర్ తెచ్చుకున్నాం. బండి సంజ‌య్ యాద‌గిరిగుట్ట వెళ్లి దొంగ ప్ర‌మాణాలు చేశాడు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్ పేరు బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆయ‌న‌ను విచార‌ణ‌కు ర‌మ్మంటే పారిపోయాడు. కోర్టుల్లో పిటిష‌న్లు వేసి విచార‌ణ‌కు రాకుండా అడ్డుకుంటున్నార‌ని క‌విత పేర్కొన్నారు.

బండి సంజ‌య్ నిన్న అయితే ఏడ్వ‌నే ఏడ్సిండు. మా నాయ‌కులంతా మంచోళ్లు.. కానీ కోర్టుకు పోతా అని చెప్తుండు. బీఎల్ సంతోష్‌ను అరెస్టు చేయొద్ద‌ని కోర్టుకు వెళ్లిండు. విచార‌ణ‌కు ర‌మ్మ‌ని కోర్టు చెబితే.. కూడా రావ‌ట్లేదు. మ‌న మంత్రులు ఐటీ, ఈడీ, సీబీఐ ఎవ‌రూ పిలిచిన వెళ్తున్నారు. మ‌నకు ఏం భ‌య‌లేదు. వాళ్లు ఎందుకు భ‌య‌ప‌డుతున్నారు. ఎందుకు రావ‌ట్లేదు. రాజ‌కీయంగా గ‌ట్టిగా ఉన్న పార్టీని, ఎదిగి వ‌చ్చిన నాయ‌కుల‌ను గ‌ద్ద‌ల మాదిరి వ‌చ్చి ఎత్తుకుపోవాల‌నే ఆలోచ‌న వారిది. రాముని పేరు చెప్పి రౌడీయిజం చేస్తున్నారు బీజేపీ నాయ‌కులు. వారికి అంత‌కు మించి వేరే ఆలోచ‌న లేదు. ఈడీ దాడుల‌కు భ‌య‌ప‌డం అని క‌విత తేల్చిచెప్పారు.

జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు తానే చక్రం తిప్పుతాననుకుంటున్న సమయంలోనే కేసీఆర్ పిడికిలి బిగించారు. ఆయన ఏదైనా ఒకటి మొదలు పెడితే.. దాని అంతు చూసే దాకా వదలడు. తెలంగాణ విషయంలో మీరంతా ఆ విషయం గమనించారు. రాజకీయంగా ఆగం కావాల్సిన అవసరమే లేదు అన్నారామె. మోడీ ఇవ్వకున్నా సరే.. గిరిజన రిజర్వేషన్లను సీఎం కేసీఆర్ పదిశాతం ప్రకటించారు.  బీజేపీకి ఏం పని లేదు. దూరదృష్టి కలిగిన నాయకుడు లేడు. ఒక ఐడియాలజీ లేదు. అందుకే రామ్ రామ్ జప్నా.. పరాయి లీడర్ అప్నా పాలసీని అలవాటు చేసుకుంది. మన రైతుబంధును పిఎం కిసాన్‌గా మోడీ ప్రభుత్వం కాపీ కొట్టారని దుయ్యబట్టారు. పిఎం కిసాన్ పథకంలో పది కోట్ల మంది రైతులను ఎందుకు తగ్గించారని ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నిద్దామని, అందుకు ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరు కథానాయకులు కావాలని కవిత పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *