ఆదివారం మెదక్ జిల్లా చిన్నకోడూరులో మిషన్ కాకతీయపై చిత్రీకరించిన ఒక డాక్యుమెంటరీలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొని మిషన్ కాకతీయ గొప్పతనం గురించి ప్రజలకు వివరించారు. మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో ఈ డాక్యుమెంటరీని చిత్రీకరించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, 60 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో ఆంధ్రాపాలకులు ఏనాడూ చెరువుల్లో తట్టెడు మట్టి కూడా తీయలేదని, చెరువుల బాగుకోసం గతంలో సీమాంధ్ర సీఎంల దగ్గరకు వెళ్తే ఏమాత్రం పట్టించుకోలేదని, పైగా చెరువులు అభివృద్ధి చెందితే తమ ప్రాంతాలకు ఎలా నీళ్ళు వస్తాయని అన్నారని చెప్పారు.
అందువల్లే చెరువులన్నీ క్షీణదశకు చేరుకున్నాయని, వాటిని పునరుద్ధరించాలనే లక్ష్యంతో మన సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయను చేపట్టారని, వరంగల్ లో మిషన్ కాకతీయ స్థూపాన్ని కేంద్రమంత్రి ఉమాభారతి చేతులమీదుగా ఆవిష్కరిస్తామని తెలిపారు. వర్షాకాలంలో చెరువులన్నీ నిండి బోరుబావుల్లో జలకళ ఉట్టిపడేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, మిషన్ కాకతీయ ప్రభుత్వ కార్యక్రమం కాదని, రాష్ట్ర ప్రజలందరి కార్యక్రమమని, దీనిని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉందని మంత్రి పిలుపునిచ్చారు. కాకతీయ రెడ్డిరాజులు 11 వ శతాబ్దంలో విస్తృతంగా చెరువులు తవ్వించారని, వారి స్ఫూర్తితోనే చెరువుల పునరుద్ధరణ పథకానికి మిషన్ కాకతీయ అని పేరు పెట్టామన్నారు. తెలంగాణలో రాష్ట్రంలోని 46,531 చెరువుల పునరుద్ధరణకు సుమారు 25 వేల కోట్ల రూపాయలను ఖర్చుచేయనున్నామని హరీష్ రావు తెలిపారు.