mt_logo

మేడారం జాతర ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న మేడారం జాతర ఏర్పాట్లను ప్రణాళిక బద్ధంగా పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. శుక్రవారం జాతర ఏర్పాట్లు, నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో ఏర్పడిన ఇబ్బందులను అధిగమించేలా, ఈసారి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ముఖ్యంగా తాగునీటి, పారిశుద్ధ్యం, వసతి, ఇతర సౌకర్యాలపై దృష్టి సారించాలని.. పెండింగ్ పనుల వేగంగా పూర్తి చేయాలని సూచించారు. సామాన్య భక్తుల క్యూ లైన్లు, భారీకెడ్లు, భ‌క్తుల ర‌ధ్దీకి అనుగుణంగా ప్ర‌త్యేక క్యూలైన్లను ఏర్పాటు చేయాలని కోరారు. కోవిడ్, ఒమిక్రాన్ వేరియంట్ లు వ్యాప్తి చెందకుండా భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జాత‌ర‌కు వ‌చ్చే భ‌క్తుల‌కు తాగు నీటి ఇబ్బందులు లేకుండా చూడాల‌ని, అలాగే స్నాన ఘ‌ట్టాల వ‌ద్ద తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు సులభంగా దారి తెలిసేలా ర‌హ‌దారులకిరువైపుల ఆర్&బీ అధికారులు సూచిక బోర్డుల‌ను ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పార్కింగ్ ఇబ్బందులు తలెత్త‌కుండా పోలీసులు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకొవాలని, పోలీసు ప్రత్యేక కంట్రోల్‌రూం ఏర్పాటు చేసి సీసీ కెమెరాలతో జాతరను పర్యవేక్షించాలన్నారు. జాతర అనంతరం చెత్త తొలగింపుపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మేడారంలో 10 కోట్లతో సూట్ రూమ్స్, డార్మిటరి, క్యాంటీన్, ఇతర సౌకర్యాలతో వసతి గృహాల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించి నివేదిక సమర్పించాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ పనులన్నీ జనవరి 15 లోగా పూర్తి అయ్యేలా ఆధికారులు పని చేయాలని ఆదేశించారు. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. మన ఇంటికి వచ్చే అతిథులను ఎలా చుస్తామో… జాతరకు వచ్చే భక్తులకు అలాంటి ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సందర్భంగా ములుగు ఎమ్మెల్యే సీతక్క జాతర ఏర్పాట్ల నిర్వహణపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశం అనంతరం మంత్రులు, ఎమ్మెల్యే సీతక్క సమ్మక్క, సారలమ్మలను దర్శించుకొని… జంపన్న వాగు వ‌ద్ద నిర్మించిన‌ స్నానఘట్టాలను, షేడ్లను, ఇత‌ర ప‌నుల‌ను పరిశీలించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే సీతక్క, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్‌సింగ్, ఇత‌ర ప్ర‌జా ప్ర‌తినిదులు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *