mt_logo

7 లక్షల మంది లబ్ది దారులకు గొర్రెల యూనిట్లు : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

అక్టోబర్ 24వ తేదీ నుండి పూర్తి వాటాధనం చెల్లించిన లబ్దిదారులకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో పశుసంవర్ధక, మత్స్య శాఖల అధికారులతో ఉన్నతస్థాయి సమావేశంలో మంత్రి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక పథకం ద్వారా గొల్ల, కురుమలకు గొర్రెల యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న సుమారు 7 లక్షల మంది అర్హులైన గొల్ల, కురుమలకు గొర్రెలను పంపిణీ చేయాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయించి లక్షల యూనిట్లను అందజేసే ప్రక్రియలో ఒక్కో గొర్రెల యూనిట్ కు లక్ష 25 వేల రూపాయలను ఖర్చు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇందులో ప్రభుత్వ వాటా 75 శాతం కాగా, 25 శాతం లబ్దిదారుడి వాటా అని చెప్పారు. మొదటి విడతలో 5 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి గొర్రెల యూనిట్లను పంపిణీ చేసినట్లు చెప్పారు. పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకొని యూనిట్ ధరను పెంచాలని విన్నవించగా, వెంటనే స్పందించి యూనిట్ గొర్రెల ధరను లక్ష 25 వేల రూపాయల నుండి లక్ష 75 వేల రూపాయలకు పెంచారని మంత్రి అన్నారు. పెరిగిన గొర్రెల యూనిట్ ధరకు అనుగుణంగా 2,797 మంది లబ్దిదారులు గతంలో చెల్లించిన వాటా కు అదనపు నిధులు చెల్లించారని, వారికి ఈ నెల 24 వ తేదీ నుండి గొర్రెల యూనిట్లను పంపిణీ చేయడం జరుగుతుందని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. DD చెల్లించిన మిగిలిన లబ్దిదారులు కూడా అదనపు లబ్దిదారుడి వాటా ధనాన్ని చెల్లించి గొర్రెల యూనిట్లను పొందాలని కోరారు.

చేప, రొయ్య పిల్లల పంపిణీని వేగవంతం చేయాలి :

మత్స్యకారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప, రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేసి, నవంబర్ 15 నాటికి 100 శాతం లక్ష్యాన్ని సాధించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మత్స్య శాఖ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు, చెరువులు, రిజర్వార్ ల నుండి నీటి ఓవర్ ఫ్లో కారణంగా చేప, రొయ్య పిల్లల విడుదల కార్యక్రమం కొంత నెమ్మదిగా జరుగుతుందని తెలిపారు. ఇప్పటి వరకు 13,043 నీటి వనరులలో 32.26 కోట్ల చేప పిల్లలను, 12.60 లక్షల రొయ్య పిల్లలను ఐదు రిజర్వాయర్లలో విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధలకు అనుగుణంగా ఉన్న చేప, రొయ్య పిల్లలను మాత్రమే విడుదల చేయాలని, విడుదల ప్రక్రియ ను తప్పకుండా వీడియో, ఫోటోగ్రఫీ చేయాలని ఆదేశించారు. ఎవరైనా నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించినట్లు తమ దృష్టికి వస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. కొన్ని జిల్లాలలో చేప పిల్లల విడుదల కార్యక్రమం అనుకున్నంత వేగంగా జరగడంలేదని, వాటికి కారణాలను సమీక్షించి నిర్దేశించిన గడువు లోగా పూర్తిస్థాయిలో పంపిణీ చేయాలని ఆదేశించారు. చేప, రొయ్య పిల్లల విడుదల కార్యక్రమంలో MLA లు, MLC లు, MP లు, రాజ్యసభ సభ్యులు ఇతర ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. మత్స్య ఫెడరేషన్ ద్వారా కోర్రమేను చేప పిల్లల ఉత్పత్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసి నివేదిక అందించాలని మత్స్య శాఖ కమిషనర్ ను మంత్రి ఆదేశించారు. అదేవిధంగా వచ్చే సంవత్సరం ఉచితంగా పంపిణీ చేయనున్న చేప పిల్లలను మన రాష్ట్రంలోనే ఉత్పత్తి చేసేందుకు అవసరమైన చర్యలను ఇప్పటి నుండే చేపట్టాలని చెప్పారు. త్వరలో ఇరిగేషన్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి వారి ఆధీనంలో ఉన్న జలవనరుల వద్ద మత్స్య శాఖ కార్యక్రమాలను నిర్వహించడానికి రూపొందించిన అంశాలపై చర్చించి తగు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *