తెలంగాణ ప్రభుత్వ విజయకిరీటంలో వ్యవసాయ పథకాలు వజ్రాల్లాంటివని అన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. సోమవారం అన్ని జిల్లాల డీఏఓలు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి కాలంలోనూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయశాఖ ఉద్యోగులు అహర్నిశలు పని చేశారని, అలా పనిచేయడం వల్లే వ్యవసాయ ఉత్పత్తుల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. వరిధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం పంజాబ్ నే మించిపోవడం అసాధారణ విజయం అని మంత్రి తెలియజేసారు. రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాల్లో రైతుబంధుది ప్రత్యేక స్థానం అన్నారు. మొత్తం అన్ని విడతల్లో కలిపి రైతుబంధు కింద రైతులకు ఇచ్చిన డబ్బు 50 వేల కోట్లు అని పేర్కొన్నారు. చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా రైతుకు ఇంత లబ్ది చేకూర్చలేదన్నారు. ప్రపంచంలోనే ఇది వినూత్నం అని కొనియాడారు. ఏటా దాదాపు 60 వేల కోట్లు ఒక్క వ్యవసాయ రంగం మీదనే ఖర్చు చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. రైతుబంధు వారోత్సవాలని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు. క్షేత్రస్థాయిలో రైతుబంధు పథకంపై అధికారులు ప్రచారం నిర్వహించాలన్నారు. ఈ సంధర్భంగా రైతుబంధు సంబరాల కరపత్రాన్ని మంత్రి విడుదల చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని జిల్లాల డీఏఓలు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు , ప్రత్యేక కమీషనర్ హన్మంతు తదితరులు పాల్గొన్నారు.