mt_logo

కౌలు రైతులకు రైతుబంధు ఇవ్వడం సాధ్యం కాదు.. నిరంజన్ రెడ్డి

శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రైతుబంధు పథకంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు వ్యవసాయ శాఖామంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలోని కౌలుదారులకు రైతుబంధు ఇవ్వడం కుదరదని, ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ అనేక సందర్భాల్లో గుర్తు చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం కింద 2018-19 ఆర్ధిక సంవత్సరంలో రూ. 12 వేల కోట్లు, 2019-20 ఆర్ధిక సంవత్సరంలో రూ. 12 వేల కోట్లు, 2020-21 ఆర్ధిక సంవత్సరంలో రూ. 14 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ మూడు ఆర్ధిక సంవత్సరాల్లో రైతు భీమా కింద 33,884 కుటుంబాలు ప్రయోజనం పొందాయి. రైతు భీమా ప్రీమియం కింద రూ. 2,917 కోట్ల 39 లక్షలు ఖర్చు చేయడం జరిగిందని చెప్పారు. రాష్ట్రం ఏర్పడ్డాక వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో ప్రతి 5 వేల ఎకరాలకు ఒక అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ ను నియమించాం. 2,601 రైతు వేదికల నిర్మాణానికి బడ్జెట్ లో కేటాయింపులు చేశామని చెప్పారు.

రైతు బంధు పథకం ఏ రాష్ట్రం కూడా అమలు చేయడం లేదు. ఈ పథకం కేసీఆర్ మానసపుత్రిక. పట్టాదారు పాసు పుస్తకం కలిగి ఉన్న రైతు మాత్రమే ఈ పథకానికి అర్హుడు. కౌలు రైతులకు రైతుబంధు ఇవ్వడం సాధ్యం కాదని, భూమి యజమానికే అది కూడా సీసీఎల్ఏ ద్వారా పట్టాదారు పాసుపుస్తకం పొందిన వారికే ఈ పథకం వర్తిస్తుందని అన్నారు. ఇనామ్ భూమి దారులకు కూడా రైతు బంధు ఇవ్వలేమని స్పష్టం చేశారు. కరోనా కష్టకాలంలో కూడా ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వ్యవసాయ రంగాన్ని అత్యవసర పరిస్థితుల కింద చేర్చి రైతాంగానికి రైతుబంధు ఇచ్చామని చెప్పారు. ఈ పథకం కోసం ప్రతి సంవత్సరం బడ్జెట్ లో కేటాయింపులు చేస్తున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *