mt_logo

హైదరాబాద్ నంబర్ వన్!!- కేటీఆర్

గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఇతర పట్టణాల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతులపై మున్సిపల్, ఐటీ శాఖామంత్రి కేటీఆర్ శాసనసభలో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచం మెచ్చిన గమ్యస్థానంగా హైదరాబాద్ నగరం దూసుకెళ్తోందని, రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణలో అత్యంత వేగంగా పట్టణీకరణ చెందిందని తెలిపారు. దేశ సగటు పట్టణ జనాభా కేవలం 31.2 శాతం మాత్రమే. తెలంగాణ పట్టణీకరణ 42.6 శాతానికి చేరుకుంది. తెలంగాణలో అనేక పాలనా సంస్కరణలు చేపట్టింది. పెరుగుతున్న పట్టణీకరణ దృష్ట్యా 74 కొత్త మున్సిపాలిటీలు, 7 కొత్త మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో 142 పురపాలికలకు రూపకల్పన జరిగింది. కట్టుదిట్టమైన శాంతి భద్రతలను అమలు చేస్తున్నాం. ప్రతినెలా జీహెచ్ఎంసీకి రూ. 78 కోట్లు, ఇతర మున్సిపాలిటీలకు రూ. 70 కోట్లు విడుదల చేస్తున్నాం. తెలంగాణ వచ్చినప్పటినుండి ఇప్పటివరకు హైదరాబాద్ అభివృద్ధి కోసం రూ. 67 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని మంత్రి వివరించారు.

హైదరాబాద్ లో ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ట్రాఫిక్ రద్దీ ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు నిర్మించామని చెప్పారు. రాబోయే రోజుల్లో మెట్రోను మరింత విస్తరిస్తామని, రాష్ట్ర అభివృద్ధిలో హైదరాబాద్ ది కీలక పాత్ర అని పేర్కొన్నారు. రూపాయికే ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇస్తున్నామని, లాక్ డౌన్ పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేశామని స్పష్టం చేశారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కునేందుకు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు చేశామని, భవిష్యత్తులో డీఆర్ఎఫ్ బృందాలను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని చెప్పారు. నూతన మున్సిపల్ చట్టం ద్వారా అనుమతులను సులభతరం చేశామని, బస్తీల్లో పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశామన్నారు. పారిశుధ్య కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, జవహర్ నగర్ డంపింగ్ యార్డు వద్ద విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంటును త్వరలో ప్రారంభించబోతున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.

ఇదిలాఉండగా ప్రపంచంలోనే హైదరాబాద్ అద్భుత నగరం అని చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ సహా ఇతర పట్టణాల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతులపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో అక్బరుద్దీన్ మాట్లాడుతూ ఐటీ రంగంలో హైదరాబాద్ దూసుకెళ్తోందని, హైదరాబాద్ భారతదేశానికి న్యూయార్క్ నగరం లాంటిదని ప్రశంసించారు. మొజాంజాహి మార్కెట్ ను ప్రభుత్వం అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దిందని, పాతబస్తీకి మెట్రో రైల్ ఎప్పుడు వస్తుందో చెప్పాలని అన్నారు. కరోనా సమయంలో జీహెచ్ఎంసీ సేవలు మరువలేనివని, అన్నపూర్ణ క్యాంటీన్లు పేదల ఆకలిని తీర్చాయని తెలిపారు. పాతబస్తీలో నెలకొన్న పారిశుధ్య సమస్యలను పరిష్కరించాలని, మూసీ సుందరీకరణ పనులు చేపట్టాలని ప్రభుత్వానికి ఓవైసీ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *