రాజేంద్రనగర్ పరిధిలోని అప్ప చెరువును పురపాలక శాఖామంత్రి కేటీఆర్ శనివారం సందర్శించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాజేంద్రనగర్ లోని అప్ప చెరువుకు గండిపడిన సంగతి తెలిసిందే. వరద ప్రవాహంతో 44 వ జాతీయ రహదారి పూర్తిగా కొట్టుకుపోగా అధికారులు మరమ్మతులు చేపట్టి రహదారిని పునరుద్ధరించారు. అప్ప చెరువును పరిశీలించిన అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ సాగునీటి శాఖతో సమన్వయం చేసుకుని తెగిన చెరువు కట్టకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని, చెరువులో ఏవైనా అక్రమ నిర్మాణాలు ఉంటే వాటిని తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుధ్యం పైన ప్రత్యేక దృష్టి సారించాలని జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కేటీఆర్ ఆదేశించారు. వరదల వల్ల ప్రాణ నష్టం జరగడం బాధాకరమని, ప్రాణ నష్టం అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నించిందని పేర్కొన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం ప్రజలకు అవసరమైన రేషన్ సరుకులు, వైద్య కిట్లు, ఇతర సదుపాయాలను కల్పిస్తున్నదని మంత్రి చెప్పారు. కేటీఆర్ వెంట మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.