గగన్ పహాడ్, అలీ నగర్ లలో వరదల వల్ల చనిపోయిన మృతుల కుటుంబాలను, వరద బాధితులను మంత్రి కేటీఆర్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పరామర్శించారు. ఇటీవల కురిసిన వర్షాలకు గగన్ పహాడ్ లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గల్లంతైన సంగతి తెలిసిందే. వారిలో ముగ్గురి మృతదేహాలు లభ్యం కాగా, మరో వ్యక్తి మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు అలీనగర్ లో కూడా ఒకే కుటుంబంలో 8 మంది గల్లంతు కాగా, వారిలో ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులకు మంత్రి కేటీఆర్ రూ. 5 లక్షల చొప్పున చెక్కులు అందజేశారు. ఈ పర్యటనలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.