mt_logo

మెదక్ జిల్లా రామాయంపేటలో పర్యటించిన మంత్రి కేటీఆర్..

పలు అభివృద్ధి పథకాలను ప్రారంభించేందుకు ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ ఈరోజు మెదక్ జిల్లా రామాయంపేటలో పర్యటించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రితో పాటు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ పేదల కన్నీళ్లు తుడిచేందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని, ఏడాదికి రూ. 4 వేల కోట్లతో పెన్షన్లు ఇస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి రాష్ట్రంలో కరెంట్ కోతలు ఉండవని, రైతులకు పగటిపూట 9 గంటల విద్యుత్ అందజేస్తామని హామీ ఇచ్చారు.

ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నాడని కేటీఆర్ విమర్శించారు. స్టాంపుల కుంభకోణంలో ఆరోపణలు రావడంతో ఆనాడు కృష్ణయాదవ్ ను మంత్రివర్గం నుండి తొలగించావు కదా, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేయడం లేదో చంద్రబాబు సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. నీతులు, ఉపదేశాలు చెప్పడం కాదు.. వాటిని ఆచరించి చూపాలని, చంద్రబాబు తప్పు చేయకపోతే ఎందుకు తప్పించుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. చట్టం ముందు అందరూ సమానులేనని, చంద్రబాబు విచారణను ఎదుర్కొని తన నిజాయితీని నిరూపించుకోవాలని సూచించారు.

గతంలో ఎన్నడూ లేనివిధంగా 76 శాతం పన్ను వసూలు చేశామని, ప్రజల పన్నులతోనే ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని మంత్రి చెప్పారు. త్వరలోనే పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం చేపడతామని, ఈ నెలలోనే రైతులకు రెండో దశ రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా రైతులకు కొత్తగా రుణాలు కూడా ఇస్తామని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన టీఎస్-ఐపాస్ ను ప్రశంసించిన పశ్చిమబెంగాల్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మంజులా చెల్లూరుకు మంత్రి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. మంజులా చెల్లూరే కాదు.. మొన్న రాష్ట్రానికి వచ్చిన రాయబారులు, పారిశ్రామికవేత్తలు కూడా సీఎం కేసీఆర్ పనితనాన్ని మెచ్చుకున్నారని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *