mt_logo

సమాజం కోసమే తండ్లాడిన ప్రజాకళాకారుడు అలిశెట్టి ప్రభాకర్ : మంత్రి కేటీఆర్

తెలంగాణకు చెందిన అద్భుతమైన కవి అలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్ధంతిని పురస్కరించుకొని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. సోషల్ మీడియా వేదికగా ఆయన్ని గుర్తు చేసుకున్నారు. ‘అతని అక్షరం మండుతున్న అగ్నికణం..ఆయన కవిత్వం ఓ పాశుపతాస్త్రం. కవిత కోసమే బతికాడు. కవిత కోసమే ప్రాణాలిచ్చాడు. కవితా ప్రాణవాయువు ఆయన. కుటుంబ పోషణార్దం ఫోటోగ్రఫీ వృత్తిని ఎంచుకున్నప్పటికీ తాను బతకడానికి కవిత్వాన్నే ఆహరంగా తీసుకుని ఆ కవిత్వాకలికే ఆహారమైన వ్యక్తి అలిశెట్టి ప్రభాకర్. జగిత్యాల జిల్లాకు చెందిన కవి అలిశెట్టి, తర్వాత హైదరాబాద్ లో స్థిరపడ్డారు. కుటుంబాన్ని పోషించడానికి ఫోటోషాప్ నడిపినప్పటికీ, ప్రధానంగా కవిత్వాన్ని ఎంచుకున్నారు. అలిశెట్టి ప్రభాకర్ కవిత్వంలోని గాఢత అర్థం చేసుకున్న ఎంతో మంది సినీ ప్రముఖులు వారి చలన చిత్రాల కోసం పని చేయమని అడిగినా… డబ్బుల కోసం తన ఆలోచనలను, అక్షరాలను అమ్ముకోలేనన్నాడు. కబళించే వ్యాధితో చివరి రోజుల్లో ఎంతో దైన్య స్థితిలో ఉన్నప్పటికీ ఎవరినీ చేతులు చాచి అర్థించలేదు. అలాంటి గొప్ప తెలంగాణ మహాకవి అయిన అలిశెట్టి జయంతి, వర్ధంతి రెండూ ఈరోజే.’ ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అలిశెట్టి ప్రభాకర్ ను గుర్తు చేసుకుంటూ… “కవి, చిత్రకారుడు, ఫోటోగ్రాఫర్ గా చివరకంటూ సమాజం కోసమే తండ్లాడిన ప్రజాకళాకారుడు అలిశెట్టి ప్రభాకర్ గారి జయంతి, వర్థంతి ఒకటే రోజు కావడం యాదృచ్చికమే అయినా… “మరణం నా చివరి చరణం కాదు” అని ఆయన చేసిన ధీరోదాత్త ప్రకటన ప్రతీ లక్ష్యసాధకుడికి స్ఫూర్తి నింపాలి” అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *