మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తరఫున నారాయణపురంలో చివరి రోజు నిర్వహించిన ప్రచారంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రోడ్ షోలో మాట్లాడారు.
‘మునుగోడు ఉపఎన్నిక ఎందుకు వచ్చిందో మీ అందరికీ తెలుసు. సాధారణంగా బైఎలక్షన్ ఎందుకొస్తది. ఎమ్మెల్యే పైకిపోతే.. ఉపఎన్నిక వస్తది. కానీ మునుగోడు ఉపఎన్నిక మాత్రం ఎమ్మెల్యే పోతే వచ్చింది కాదు. ఎమ్మెల్యే అమ్ముడుపోతే వచ్చింది. రాజగోపాల్ రెడ్డి 18వేల కోట్లకు మునుగోడు ఆత్మగౌరవాన్ని మోడీ కాళ్ల వద్ద తాకట్టు పెట్టిండు. నాలుగేండ్లు నియోజకవర్గాన్ని పట్టించుకోకపోయినా, ఏ పనిచేయక పోయినా.. ఓటర్లను తులం బంగారం ఇచ్చి కొనుగోలు చేస్తా అనే అహంకారంతో ఉన్నాడు. మోడీ అహంకారం, రాజగోపాల్ రెడ్డి అహంకారం, కాంట్రాక్టర్ మదంతోనే మునుగోడు ఉపఎన్నిక వచ్చింది.
మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు సిలిండర్ ధర రూ. 400 ఉంటే.. ఇప్పుడు రూ. 1200 అయింది. ధరలు ఎంత పెంచినా.. ప్రజలు తమకే ఓటేస్తారనే బలుపు, మదంతో మోడీ ఉన్నాడు. గతంలో ఉల్లిగడ్డ ధర పెరిగితేనే.. కేంద్రప్రభుత్వం పడిపోయింది. ఇప్పుడు అన్ని ధరలు పెరిగాయి. మరి ఈ మోడీ ప్రభుత్వం మనకు అవసరమా? పెరిగిన ధరలతో నిత్యావసరాల ధరలు కూడా పెరిగాయి.
మోడీ.. కార్పొరేట్ వ్యక్తులను కడుపులో పెట్టికొని చూసుకుంటూ.. సామాన్య ప్రజలను గోసపెడుతుండు.
కేసీఆర్ రాకముందు కరెంట్ ఉంటే వార్త.. ఇప్పుడు కరెంట్ పోతే వార్త అవుతుంది. సాగునీటి కోసం మునుగోడు లిఫ్టులన్నింటినీ పూర్తి చేస్తాం. తండాలను గ్రామపంచాయతీలుగా చేసింది సీఎం కేసీఆర్ కాదా..? ఆలోచన చేసి.. ఓటు వేయండి. ఆగమై బీజేపీకి ఓటేస్తే.. గ్యాస్ సిలిండర్ ధర రూ. 4000 చేస్తాడు.
గాడుదలకు గడ్డి వేసి.. ఆవులకు పాలు పిండితే వస్తాయా.. ఇంకా 14 నెలలు మనదే ప్రభుత్వం. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మునుగోడును అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకుందాం. నేను మునుగోడు దత్తత తీసుకుంటున్నా అని గతంలోనే చెప్పాను. చెప్పినట్లే అన్నీ రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తా.
ఆ గట్టున ఉంటావా నాగన్న.. ఈ గట్టున ఉంటావా అని రంగస్థలంలో ఓ పాట ఉంది. అలా మీరు ఏ గట్టున ఉంటారో తేల్చుకోవాలి. ఆ గట్టున గ్యాస్ ధర రూ. 1200 చేసినోళ్లున్నారు.. ఈ గట్టున పేదింటి ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయలు ఇస్తున్న కేసీఆర్ ప్రభుత్వం ఉంది. ఆ గట్టున పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన మోడీ ఉంటే.. ఈ గట్టున 200 పెన్షన్ను రూ. 2000 వేలు చేసిన కేసీఆర్ ఉన్నాడు.
పెద్దోళ్ళ కోసం ఎవరున్నారు.. పేదోళ్లకోసం ఎవరున్నారో ప్రజలు ఆలోచించాలి. రైతుబందు కావాలా..? రాబంధు కావాలా..? గరీబోళ్ల పార్టీ కారు గుర్తుకే మీ ఓటు వేసి.. ప్రభాకర్ రెడ్డిని గెలిపించి.. బీజేపీకి బుద్ధి చెప్పండి’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.