తెలంగాణ రాష్ట్రంలో లైంగిక నేరస్థుల రిజిస్టర్‌ను ఏర్పాటు చేయాలని సామాజిక కార్యకర్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత సునితా కృష్ణన్ చేసిన విజ్ఞప్తికి ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణలోని లైంగిక నేరాల్లో నిందితులుగా ఉన్న వారితో అమెరికా తరహాలో జాబితా తయారు చేయాలని, ఆ జాబితా ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని సామాజిక కార్యకర్త సునీత కృష్ణన్ మంత్రి కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. రిక్రూట్మెంట్ ప్రక్రియలో సెక్స్ అఫెండర్స్ రిజిస్టర్ పనిచేస్తుందని తెలిపిన సునీత… నేరస్థుల జాబితాను తయారు చేసేందుకు తన వద్ద ఒక కాన్సెప్ట్ ఉందని, సుమారు 20 దేశాల్లో నిర్వహించిన పరిశోధనల ఆధారంగా ఆ విధానాన్ని రూపొందించామని, దాన్ని సమర్పించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
కాగా మంత్రి కేటీఆర్ ఆ ట్వీట్ పై స్పందిస్తూ… లైంగిక నేరస్థుల జాబితాను కచ్చితంగా తయారు చేద్దామని, దానికి సంబంధించిన కాన్సెప్ట్‌ను ప్రభుత్వానికి ప్రజెంట్ చేయాలని, ఆ కాన్సెప్ట్‌ను తాము కచ్చితంగా ముందుకు తీసుకువెళ్లనున్నట్లు పేర్కొన్నారు.