రాష్ట్రంలో ఉపయోగంలో లేని బోరుబావులను వెంటనే మూసివేయాలని, ఉపయోగంలో ఉన్న బోరుబావులకు ఫెన్సింగ్ వేయించాలని ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మెదక్ జిల్లా పుల్కల్ మండలం బొమ్మారెడ్డి గూడెంలో బోరుబావిలో పడి మూడేళ్ళ బాలుడు మృత్యువాత పడడంపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని, తనను ఆ సంఘటన తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్ లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు.
పంచాయితీ రాజ్ కమిషనర్ అనితా రామచంద్రన్, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ బీ సురేందర్ రెడ్డితో ఆదివారం మంత్రి కేటీఆర్ అత్యవసర సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో బోరుబావులపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని కలెక్టర్లకు, జిల్లా పంచాయితీ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. సుప్రీంకోర్టు కూడా ఉపయోగంలోలేని బోరుబావులను పూడ్చివేయాలని, ఉపయోగంలో ఉన్న వాటి చుట్టూ ఫెన్సింగ్ వేయాలని ఆదేశించిందని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఖచ్చితంగా అమలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, బోరుబావులు పూడ్చే బాధ్యతను గ్రామ సర్పంచ్ తో పాటు గ్రామ కార్యదర్శులే బాధ్యత తీసుకోవాలని మంత్రి సూచించారు.