mt_logo

ప్రపంచంలో అతిపెద్ద ఇంక్యుబేటర్ క్యాంపస్ ‘స్టేషన్ ఎఫ్” బృందంతో మంత్రి కేటీఆర్ భేటీ

ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌, శుక్రవారం ప్యారిస్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌ క్యాంపస్‌ ‘స్టేషన్‌ ఎఫ్‌’లో పర్యటించి స్టేషన్‌ ఎఫ్‌ బృందంతో భేటీ అయ్యారు. టీ హబ్‌, వీ హబ్‌, టీ వర్క్స్‌ వంటి ఇన్నోవేషన్‌ ఎకోసిస్టమ్‌ సంస్థల గురించి వివరించారు. స్టేషన్‌ ఎఫ్‌లో వెయ్యి స్టార్టప్‌లు ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్ విమానాశ్రయంలో పెట్టుబడులు పెట్టిన ఏడీపీ చైర్మన్‌, సీఈవో అగస్టిన్‌ డి రోమనెట్‌తో కూడా కేటీఆర్‌ బృందం సమావేశమైంది. భారతదేశంలో విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, కరోనా ఆంక్షలు సడలించడంతో వైమానిక పరిశ్రమ దేశంలో పెద్దఎత్తున విస్తరించే అవకాశాలున్నాయని, అనేక ప్రపంచ ఏరోస్పేస్‌ కంపెనీలకు హైదరాబాద్‌ కేంద్రంగా ఉందని కేటీఆర్ వివరించారు. అనంతరం సనోఫీ ఇంటర్నేషనల్‌ ఆపరేషన్స్‌ హెడ్‌ ఫాబ్రిస్‌ బస్చిరా, గ్లోబల్‌ వ్యాక్సిన్‌ పబ్లిక్‌ అఫైర్స్‌ హెడ్‌ ఇసాబెల్లె డెస్చాంప్స్‌ను కేటీఆర్‌ కలిశారు. సనోఫీ త్వరలో తన హైదరాబాద్‌ ఫెసిలిటీ నుండి సిక్స్‌ ఇన్‌ వన్‌ వ్యాక్సిన్‌ ఉత్పత్తిని ప్రారంభించనుండగా.. ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అనంతరం పారిస్‌లోని మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఆఫ్‌ ఫ్రాన్స్‌ (ఎంఈడీఈడీ) డిప్యూటీ సీఈవో జెరాల్డిన్‌ లెమ్లేతో చర్చలు జరిపింది. ఆహార ధాన్యాలు, మాంసం, పాలు, చేపల ఉత్పత్తిలో తెలంగాణ సాధించిన విజయాలను కేటీఆర్‌ వివరించారు. మంత్రి వెంట పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌రంజన్‌, ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌, డిజిటల్‌ మీడియా డైరెక్టర్‌ దిలీప్‌ కొణతం ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *