ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) యూనిట్ పునఃప్రారంభానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. తెలంగాణలోనేకాదు దేశీయంగా కూడా సిమెంటుకు భారీ డిమాండ్ ఉన్నందున సీసీఐ పరిశ్రమను తిరిగి ప్రారంభించాలని కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, మహేంద్రనాథ్ పాండేలకు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభించేందుకు అవసరమైన సదుపాయాలన్నీ ఉన్నాయని గుర్తుచేశారు. నిర్వహణకు అవసరమైన విశాలమైన 772 ఎకరాల ప్రాంగణంతో పాటు, 170 ఎకరాల సీసీఐ టౌన్ షిప్, 1500 ఎకరాల్లో సుమారు 48 మిలియన్ టన్నుల లైమ్ స్టోన్ నిల్వలు, 2 కేవీఏ విద్యుత్ సరఫరా వ్యవస్థతో పాటు ఉత్పత్తికి సరిపడా నీటి లభ్యత కూడా ఉందని కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు.
టీఎస్ ఐపాస్ ద్వారా తాము భారీగా పెట్టుబడులు తెస్తున్నామని వెల్లడించారు. తాము ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తుంటే.. కేంద్రం మాత్రం సీసీఐ లాంటి కంపెనీలను తెరవకుండా ఉపాధి అవకాశాలను దెబ్బ కొడుతున్నదని విమర్శించారు. కేంద్రం మొండి వైఖరితో ఆదిలాబాద్ యువతకు తీరని ద్రోహం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీసీఐ తెరిస్తే ఆదిలాబాద్ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. కంపెనీ పునఃప్రారంభానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. భౌగోళికంగా ఆదిలాబాద్‌కు ఉన్న సానుకూలతను ఉపయోగించుకుని… మళ్లీ ప్రారంభిస్తే తెలంగాణ అవసరాలకే కాకుండా మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా ఇక్కడి సిమెంట్ సరఫరా చేసేందుకు వీలవుతుందన్నారు. వెనుకబడిన మారుమూల ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లాలో పరిశ్రమ ప్రారంభిస్తే… ఆ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు. గిరిజనులు, ఆదివాసీలు పెద్ద సంఖ్యలో ఉండే ఈ ప్రాంతంలో కంపెనీని తిరిగి ప్రారంభిస్తే స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందన్నారు.